వైసీపీకి గడప గడపలో వస్తున్న రియాక్షన్ ఇదే- పవన్ కళ్యాణ్ వ్యంగ్య ట్వీట్
ఏపీలో మూడేళ్ల పాలన పూర్తిచేసుకున్న వైసీపీ సర్కార్ జనంలోకి వెళ్లి తమ ప్రభుత్వంపై ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో వైసీపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. దీనిపై సీఎం జగన్ కూడా నెలకోసారి సమీక్ష కూడా నిర్వహిస్తున్నారు. మధ్యలో ఎమ్మెల్యేలకు పలు సూచనలు కూడా చేస్తున్నారు. అయితే దీనిపై విపక్షాలు మాత్రం తమదైన శైలిలో స్పందిస్తున్నాయి.
ఇదే క్రమంలో వైసీపీ నిర్వహిస్తున్న గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా ఓ వ్యంగ ట్వీట్ సంధించారు. గడప గడపకూ కార్యక్రమానికి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలకు ఎదురవుతున్న పరిస్ధితులపై పవన్ కళ్యాణ్ ఈ ట్వీట్ పెట్టారు. ఇప్పటికే వైసీపీ గడప గడప కార్యక్రమంలో జనం అధికార పార్టీ నేతల్ని నిలదీస్తున్న పరిస్ధితులపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ ట్వీట్ లో పవన్ ఓ కార్టూన్ ను జత చేశారు.

పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్ కార్టూన్ లో గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన వైసీపీ నేతల్ని జనం చీపుర్లు, అప్పడాల కర్రలతో తరిమిస్తున్నట్లుగా ఉంది. దీంతో ఇద్దరు నేతలు పరుగులు తీస్తున్నట్లుగా కనిపిస్తోంది. వీరిద్దరిలో ఒకరు చిన్న చిన్న అపశ్రుతులు తప్ప కార్యక్రమం అంతా సజావుగా నడుస్తోందంటూ వ్యాఖ్యానిస్తున్నట్లుగా పెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో పలు చోట్ల అధికార పక్ష నేతలు, ఎమ్మెల్యేలను జనం గడప గడప కార్యక్రమంలో నిలదీస్తున్నప్పటికీ నేతలు మాత్రం అంతా సజావుగానే ఉన్నట్లు చెప్పుకుంటున్నారనే అర్ధం వచ్చేలా పవన్ ఈ ట్వీట్ పెట్టినట్లు తెలుస్తోంది.
— Pawan Kalyan (@PawanKalyan) August 3, 2022












Click it and Unblock the Notifications