యుద్ధం ఎవరూ కోరుకోరు..! కాల్పుల విరమణ వేళ పవన్ కామెంట్స్..!
భారత్-పాకిస్తాన్ మధ్య ఇవాళ కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీన్ని దేశవ్యాప్తంగా పలువురు స్వాగతిస్తున్నారు. అదే సమయంలో విజయవాడలోని ఏపీ రాజ్ భవన్ లో సర్వమత సమ్మేళనం జరిగింది. దీనికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు, మతపెద్దలు హాజరయ్యారు. ఇందులో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. మతం కంటే మానవత్వమే ముఖ్యమని ఆయన తెలిపారు.
పహల్గాం ఘటన దేశాన్ని కలచివేసిందని, దేశం సహనానికి మారుపేరని ఆయన తెలిపారు. అన్ని ధర్మాలు, మతాలు విలసిల్లాలని అందరూ కోరుకుంటామన్నారు. రాజ్యాంగం రాక ముందు నుంచే ఈ సంస్కృతి ఉందన్నారు. ఉగ్రవాదం ఎప్పుడూ మన వెంటే ఉన్న ప్రమాదం అన్నారు. భిన్నత్వంలో ఏకత్వంలో చూసిన నేల ఇది అని పవన్ తెలిపారు. మన మతాలు వేరైనా అంతా భారతీయులమే అన్నారు. ఈ సందేశం దేశం మొత్తానికి చేరాలన్నారు.

ఈ దేశాన్ని విడగొడదాం, విభజిద్దాం అని ఎన్నో శక్తులు ప్రయత్నిస్తుంటాయని, కానీ సగటు మనిషి మతానికి అతీతం అన్నారు. యుద్ధం కావాలని, గొడవ పెట్టుకోవాలని ఎవరూ కోరుకోరని,కానీ తప్పనిసరి అయ్యే యుద్ద పరిస్ధితులు వచ్చాయన్నారు. ఇదంతా ముగిసిపోవాలని, ఆ శుభవార్త కూడా త్వరలో వింటామన్నారు. అంతా ఏకమై తమ వారికి మతం కంటే దేశం గొప్పదనే సందేశం అందించాలన్నారు. మతం ఏదైనా మానవత్వానికే పెద్దపీట వేయాలన్నారు. తమ డీఎన్ఏలో దీన్ని భాగంగా మార్చుకోవాలన్నారు. మన బలగాలకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ పవన్ అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications