టీడీపీ ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహం- కఠిన చర్యలకు ఆదేశాలు..!
ఏపీలో డిప్యూటీ సీఎం కమ్ అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఓ విషయంలో సీరియస్ అయ్యారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యే అధికారులపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఆయనపై తక్షణ చర్యలకు ఆదేశాలు ఇచ్చారు. అంతే కాదు పార్లమెంట్ లో ఓవైపు కేంద్రం తప్పు చేసి జైలుకు వెళ్తే 30 రోజుల్లో ప్రధాని, సీఎం, మంత్రుల్ని సైతం పదవీచ్యుతుల్ని చేసే బిల్లు తెస్తుంటే మీరెంత అనేలా టీడీపీ ఎమ్మెల్యేకు పవన్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
శ్రీశైలం అడవిలో రెండు రోజుల క్రితం అటవీ అధికారులపై స్ధానిక టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తన అనుచరులతో కలిసి దాడి చేశారు. అర్ధరాత్రి పూట రెండు గంటల పాటు వారిని వాహనాల్లో తిప్పుతూ దాడికి పాల్పడ్డారు. దీనిపై ఆవేదన వ్యక్తం చేసిన అధికారులు.. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను సైతం బయటపెట్టారు. అంతే కాదు అటవీ మంత్రి పవన్ కళ్యాణ్ కు సైతం ఫిర్యాదు చేశారు. దీనిపై పవన్ సీరియస్ అయ్యారు.

శ్రీశైలం అటవీ ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ ఉద్యోగులతో ఘర్షణకు దిగి, దాడికి పాల్పడ్డ ఘటన గురించి శాఖ ఉన్నతాధికారులు వివరించారని, ఈ ఘటనల్లో శాసనసభ్యులు, ఆయన అనుచరుల ప్రమేయంపై విచారించి సవివరంగా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. బాధ్యులపై నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేయాలని స్పష్టంగా చెప్పానన్నారు.

చట్టాలను అతిక్రమించి క్రిమినల్ చర్యలకు పాల్పడి ఏ స్థాయిలో ఉన్నవారినైనా ఉపేక్షించకూడదని, ఇందుకు ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఒకటే అని, అరెస్టయిన 31వ రోజు పదవి కోల్పోయే చట్టం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతోందని పవన్ తెలిపారు. తాము తప్పు చేసినా బాధ్యులను చేయమని రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, తాను కూడా అసెంబ్లీలో స్పష్టంగా చెప్పామని గుర్తుచేశారు. నిబద్ధతతో, నియంత్రణతో విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. కాబట్టి ప్రజా జీవితంలో ఉన్నవారు ముందుగా తమను తాము నియంత్రించుకోవాలన్నారు. ఉద్యోగుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించేవారు ఏ స్థాయిలో ఉన్నా గౌరవ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదన్నారు.












Click it and Unblock the Notifications