పవన్ కళ్యాణ్ మౌనం: చంద్రబాబుతో టగ్ ఆఫ్ వార్, జగన్‌కు కలిసొచ్చేనా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరు చేపట్టడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మౌనం వహించిన నేపథ్యంలో జగన్‌కు ప్రత్యేక హోదాపై పోరు కలిసి వచ్చేట్లు కనిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం కొన్నాళ్లు వేచి చూద్దామని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సూచించారు.
పవన్ కళ్యాణ్ వేచి చూసే ధోరణి చేపట్టడంతో వైయస్ జగన్ దూకుడు పెంచారు. కేవలం రాజకీయ కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థులతో ముఖాముఖి ద్వారా తన పోరుకు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు సాగించారు. ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలేమిటో ఆయన వివరంగా విద్యార్థులకు చెబుతూ వచ్చారు.
తాజాగా, ఈ నెల 26వ తేదీన తాను చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడం కూడా జగన్ కలిసి వచ్చేట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ప్రత్యేక హోదాను ఆయుధంగా చేసుకుని జగన్ విసురుతున్నారు. సినీ నటుడు శివాజీ ఆందోళనలు చేపట్టినప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ఎవరు ఆందోళన చేసినా సమర్థిస్తానని అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని బిజెపిపైకి, కేంద్ర ప్రభుత్వంపైకి గురి పెట్టే ప్రయత్నం అందులో కనిపించింది.

ప్రస్తుత పరిస్థితిలో చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై గానీ, బిజెపి నాయకత్వంపై గానీ పోరాటం చేసే స్థితిలో లేరనేది జగన్ వాదన. బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికి చంద్రబాబు సిద్ధంగా లేరనేది స్పష్టమే. ఇదే సమయంలో ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా లేదనేది కూడా దాదాపుగా స్పష్టమైంది. దీంతో జగన్ ప్రత్యేక హోదాపై ఆందోళనలకు శ్రీకారం చుట్టి చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు. నోటుకు ఓటు కేసు నుంచి బయటపడడానికి చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆయన విమర్శిస్తున్నారు.
తనపై కేసులు ఉన్న విషయాన్ని కూడా ఆయన స్వయంగా ప్రస్తావిస్తున్నారు. రాజకీయ నాయకులపై కేసులు ఉంటాయని అంటూ అది పెద్ద సమస్య కాదని అంటూ తాను రాజీ పడకుండా పోరాటం చేశాను కాబట్టే తనపై కక్షతో కేసులు పెట్టారని ఆయన చెబుతున్నారు. ఈ స్థితిలో చంద్రబాబు ప్రత్యేక హోదాపై సానుకూలంగా ప్రతిస్పందించే స్థితిలో లేరు.
అదే సమయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై పోరాటం చేసే స్థితిలో లేరు. దానిపై పోరాటం మొదలు పెడితే మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకమే అవుతుంది కాబట్టి ఆయన అందుకు సిద్ధపడకపోవచ్చునని అంటున్నారు. దాంతో జగన్ దూకుడు పెరిగిందని అంటున్నారు. పవన్ కళ్యాణ్‌ను కూడా వెనక్కి నెట్టవచ్చునని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.
జగన్ నిరవధిక నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడం కూడా జగన్‌కు కలిసి వస్తుందని అంటున్నారు. దానిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇప్పటికే దూకుడు పెంచింది. అనుమతి నిరాకరించినా రోడ్డుపై జగన్ బైఠాయిస్తారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. దీంతో రాజకీయం వేడెక్కేట్లు కనిపిస్తుంది. ఇది జగన్‌కు రాజకీయంగా మేలు చేస్తుందనే ఉద్దేశం రాజకీయ నిపుణుల నుంచి వ్యక్తమవుతోంది.
ఎవరికీ ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్‌కు ఆంతరాయం కలగకుండా జగన్ దీక్ష చేస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి చెప్పారు. ఆయన మరోసారి పోలీసులకు అనుమతి కోసం విజ్ఞప్తి పెట్టుకున్నారు. ప్రైవేట్ స్థలంలో దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటామని కూడా చెప్పారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోతే రేపు కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications