పవన్ కల్యాణ్ ఉద్వేగం: బిజెపి, టిడిపిలనే కాదు, ఒక్కొక్కరినీ ఉతికేశారు
హైదరాబాద్: కాకినాడలో శుక్రవారం సాయంత్రం కాకినాడ బహిరంగ సభలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బిజెపిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఏదో తీపి కబురు ఇస్తారనుకుంటే రెండు లడ్లు ఇచ్చారని, మన పాతిక మంది ఎంపిలకే సరిపోవని ఆయన అన్నారు. తెలుగుదేశం నాయకులపై గౌరవం ఉంది, వ్యక్తిగతంగా ఏ పార్టీ నాయకులతో ఏ విభేదాలు లేవని ఆయన అన్నారు. బిజెపి నాయకులకు ఎంత ధైర్యమని, ఇక్కడికే వచ్చి విడగొడుతారా అని అడిగారు.
తెలుగుదేశం పాచిపోయిన రెండు లడ్డూలను తీసుకుంటుందా లేదా అన్నదే మన ముందున్న ప్రశ్న అని అన్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, అవకాశవాద రాజకీయాల వల్ల అని అన్నారు. అవకాశవాద రాజకీయాలు ఇలాగే ఉంటే రాజ్యాలు ఇలాగే ఉంటాయి, సమస్యలు ఇలాగే ఉంటాయని ఆయన అన్నారు. పదవుల ద్వారానే సమస్యలను పరిష్కరించాలనుకునే వారు నిజమైన రాజకీయ నాయకులని అన్నారు.

అవకాశవాద రాజకీయాలను కాకినాడ సీమాంధ్ర ఆత్మగౌరవ సభ నుంచి హెచ్చరిస్తున్నానని, సమస్యలను పరిష్కరించుకున్నా ఫరవా లేదు గానీ కొత్త సమస్యలు సృష్టించవద్దని, తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దని అన్నారు. కుంభకర్ణుడిలా రెండేళ్లు నిద్రపోయావా అని అంటారని, దాన్ని నిద్ర అని ఎందుకనుకుంటారు, ధ్యానం అని ఎందుకు అనుకోకూడదని అన్నారు. సంస్కారాన్ని బట్టి అర్థం చేసుకోవడం ఉంటుందని అన్నారు.
వేల కోట్లు సంపాదించలేదు..
సినిమాలన్నా వదిలేయండి, రాజకీయాలన్నా చేయండని అంటారని, తాను సినిమాలు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. సినిమాలు వదిలేస్తే మీరే తిండి పెట్టాలని, తాను సమస్యలపై పోరాటం చేస్తానని ఆయన అన్నారు. తాను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, అదే స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. రాజకీయ నాయకుల మాదిరిగా తాను వేల కోట్లు సంపాదించుకోలేదని అన్నారు.
రాజకీయాలు చేయడానికి తాను సామాజిక తత్వం చదివానని, చదివితే సరిపోదు దాన్ని జీవితంలో పాటించాలని అనుకుంటున్నానని ఆయన అన్నారు. సమగ్రమైన ఆలోచన విధానం కావాలని అన్నారు. మనకు ముఖ్యంగా కావాల్సింది నీరు, వాతావరణం, ఖనిజాలు, మానవనరులని, వాటిని జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుందని, అందరూ సుఖంగా
పొలిటికల్ గాడ్ ఫాదర్స్ లేరు...
నాకు పొలిటికల్ గాడ్ ఫాదర్స్ లేరని, ప్రజా సమస్యలే గాడ్ ఫాదర్స్ అని అన్నారు. నన్ను నడిపించే శక్తి మీరేనని అన్నారు. ప్రతి ఒక్కరు పిచ్చి కూతలు కూస్తే, బిజెపివారు నడిపిస్తున్నారంటే, టిడిపి నడిపిస్తున్నారంటే నాకు పౌరుషం లేదా, అలా కూసే వాళ్లందరికి మీరు చెప్పాలని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా వంటి కొత్త పదాలు మన డిక్షనరీలకో వచ్చాయని, వాటి గురించి తెలుసుకునే ముందు మన రాష్ట్రం, దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాల్సి ఉందని అన్నారు.
తెలంగాణ వాళ్లు మన సోదరులు అని, తెలంగాణలో భూస్వామ్య దౌర్జన్యాల వల్ల వాళ్లు వెనకబడిపోయారని ఆయన అన్నారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జై తెలంగాణ ఉద్యమం తలెత్తిందని ఆయన అన్నారు. 1972లో ఆంధ్రలో జై ఆంధ్ర ఉద్యమం జరిగిందని, ఇందులో 400 మంది చనిపోయారని, కేంద్రంలో కూర్చున వెంకయ్య నాయుడు కూడా జై ఆంధ్ర ఉద్యమ సారథుల్లో ఒక్కరు అని అన్నారు.
ఇందిరా గాంధీ స్ఫూర్తిని కాంగ్రెసు వదిలేసింది...
విడిపోవాలనుకుంటే అది మన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఇందిరా గాంధీ అన్నారని, ఇందిరా గాంధీ బాధపడి మరణాలకు క్షమాపణలు చెప్పి రాష్ట్రాన్ని విడదీయబోమని చెప్పారని అన్నారు. ఇలాంటి స్ఫూర్తినిచ్చినందుకు ఇందిరా గాంధీకి అభివాదాలు చేద్దామని అన్నారు.
కాంగ్రెసు నాయకులది 150 ఏళ్ల చరిత్రనే అని, అయితే వారికి లాల్ బహదూర్ శాస్త్రికి లాంటి విలువలున్నాయని, ఇందిరా గాంధీ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించి రాష్ట్రాన్ని విడిగొట్టారని అన్నారు. బిజెపి ద్రోహం చేసిందని, ద్రోహాన్ని మరిచిపోదామనుకుంటే మరిచిపోనీయడం లేదని, జాతీయ నాయకులు ఈ రోజు రెండు రాష్ట్రాల్లో అస్థిరత సృష్టించారని ఆయన అన్నారు. ఏ రాజకీయ నాయకుడైనా సుస్థిరతను ఇవ్వాలని, దేశ సమగ్రత సాధించాలని, చేతకాక విడిగొట్టి అటు తెలంగాణకు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆయన అన్నారు.
ఒక ఓటు వేయండి, రెండు రాష్ట్రాలు ఇస్తామని బిజెపి కాకినాడలో చెప్పిందని, ప్రత్యేక హోదాకు రాజ్యాంగం ఒప్పుకోవడం లేదని చెబుతున్నారని, ఆయన అన్నారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలకు విలువ లేదా అని ఆయన అడిగారు. ఓ పార్టీ తీర్మానానికి అంగీకరించిన మీరు నిలబెట్టుకోవడానికి సిగ్గు లేదా అని బిజెపి నాయకులు అడిగారు. అంబేడ్కర్ స్ఫూర్తి మీకు లేదా, ఆ స్ఫూర్తి ఉందని చెప్తే ప్రత్యేక హోదాకు బిజెపి కట్టుబడి ఉండాలని పవన్ కల్యాణ్ అన్నారు.
రేపటి బంద్‌ను సమర్థించను...
మీ భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి రాలేదని, దాని వల్ల ఏ మాత్రం గాయమైన నా గుండె నొచ్చుకుంటుందని, రాస్తా రోకోలు చేయాలని, బంద్ చేయాలని తాను అడగడానికి రాలేదని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులున్నారు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులున్నారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులున్నారని, వారంతా ముందుకు వస్తే మనం రోడ్డు మీదికి వద్దామని, కేంద్రం దిగి వచ్చేలా ఏం చేయాలనేది ఆలోచిద్దామని ఆయన అన్నారు.
సిపిఎం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయని గుర్తు చేస్తూ అది తనకు ఇష్టం లేదని, దానికి కారణం ఉందని అన్నారు. మీరెందుకు కష్టపడాలని, అసెంబ్లీలో కూర్చుందెవరు, పార్లమెంటులో కూర్చుందెవరు, పార్లమెంటు క్యాంటిన్లో సబ్సిడీ ఫుడ్ తింటుందెవరని అన్నారు. మీరు కష్టపడి చదువుకోవాలని ఆయన ప్రజలకు చెప్పారు. చేయాల్సిందంతా చేయండి, మేం అక్కడ కూర్చుంటామని అంటున్నారని, అలాంటి సాముగరిడీలు చూపించకండి, మీ పప్పులు ఉడకవని అన్నారు.
చంద్రబాబు నిర్ణయం తీసుకోవాలి...
చంద్రబాబు తీసుకోవాల్సిన నిర్ణయమని అన్నారు. మీరు పాచిపోయిన లడ్డూలు తీసుకుంటారా వారి ముఖాన విసిరికొడుతారా అనేది మీరు నిర్ణయించుకోవాలని అన్నారు. మనకు ఆత్మగౌరవం ఉందని అన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ విడిపోవం విడి అంశమని, రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రజలు ఏం ద్రోహం చేశారని తాను మొదటి నుంచి అడుగుతున్నానని అన్నారు.
భారతదేశం నాది అనుకుని బతికినవాన్ని, నేను సీమాంధ్ర వాడిని అయిపోయాను, తెలుగువాడిని అయిపోయానని అన్నారు. సీమాంధ్రకు అన్యాయం జరిగిందని అన్నారు. సీమాంధ్ర నాయకులు, తెలంగాణ నాయకులు కలిసి తెలంగాణకు అన్యాయం చేశారని, కేవలం సీమాంధ్ర నాయకులు అంటే అంగీకరించబోనని, చెన్నారెడ్డి, జానారెడ్డి వంటివారు కూడా ఉన్నారని, తెలంగాణకు అన్యాయం చేయడంలో సీమాంధ్ర నాయకుల తప్పు ఎంత ఉందో, అప్పటి తెలంగాణ నాయకులది కూడా అంతే ఉందని అన్నారు.
సీమాంధ్రలో సెంట్ భూమి లేదు...
ఒక్క సెంటు భూమి కూడా సీమాంధ్రలో లేదని, తనకు ఉన్నదల్లా హైదరాబాదులోనే అని, కానీ ముందుకు రాకపోతే సత్యం వెల్లడి కాదని, సత్యం మాత్రమే గెలుస్తుందని, మరేది గెలువదని అన్నారు. ఒక సమస్యను ఎదుర్కోవడంలో భయాలు లేవని, ఒక్కసారి రాజకీయ నాయకులను, వారు జాతీయ నాయకులు కావచ్చు కానీ నా గుండెల్లోని మాట చెప్పడానికి మీ గుండెల్లోని మాట చెప్పడానికి నేను వెనుకాడనని అన్నారు.
మనకు ఎవరూ లేరు, మనమే సైన్యమని, మనం జనసైన్యమని, మనకు గుండాలు అవసరం లేదని, గుండాల సాయం అక్కర్లేదని అన్నారు. దైవం ఉంది, ధైర్యం ఉంది, ఆత్మగౌరవం ఉంది, పౌరుషం ఉంది, పోరాట పటిమ ఉందని ఆయన అన్నారు.
రాజకీయం గడ్డం గీసుకున్నంత తేలిక కాదని అంటున్నారని, గడ్డం గీసుకున్నంత తేలికగా రాష్ట్రాన్ని విడగొట్టారని, అవకాశవాద రాజకీయాలు చేయడానికి మీలా నేను రాలేదని అన్నారు. సైద్ధాంతిక భూమికతో వచ్చానని, వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి రాలేదని చెప్పారు.
తాను తెలుగుదేశం పార్టీకి ఓటేమీ వేయలేదని, వారికి తాను మద్దతు తెలపానని, ప్రాణాలు ఫణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం, మీ అందరి ప్రయోజనాల కోసం ఓరే దద్దమ్మల్లారా, చవటల్లారా, సన్నాసుల్లారా అని తెలంగాణవాళ్లు సీమాంధ్ర నాయకులను తిడుతుంటే బాధేసిందని అన్నారు. ఇది పద్ధతి కాదంటారని, తనకు బాధ కలిగిందని, పౌరుషం లేదా అనే బాధ కలిగిందని అన్నారు. పార్టీలు పాలించాయి, సీమాంధ్ర ప్రజలు కాదని ఒక్క నాయకుడంటే ఒక్క నాయకుడు అనలేదని అన్నారు.
ఢిల్లీలో మన పార్లమెంటు సభ్యులను చెత్త కింద చూస్తుంటే తాను 11 రోజులు దీక్ష చేశానని అన్నారు. తెలంగాణ ఇచ్చినందుకు కాదని, 1997లో రాష్ట్రాన్ని విడగొడుతామని చెప్పిన బిజెపి అంత కాలం ఎందుకు ఆపారని అన్నారు. కాంగ్రెసు 2004లో కాంగ్రెసు ఇస్తామంటే ఎందుకు ఆగారని అన్నారు. కొట్టుకుని చావండని తెలుగు ప్రాంతాలకు అన్యాయం చేశారని అన్నారు.
దేశాన్ని తాను ప్రేమించానని, పాఠశాలలో చేసిన గుండెల్లో ప్రతిజ్ఞ ఉండిపోయిందని, అందుకే రాష్ట్రాన్ని విడగొట్టినందుకు బాధేసిందని అన్నారు. విడిగొట్టినప్పుడు ఎందుకు బాధ ఉండదా, ధర్నాలూ రాస్తారోకోలూ చేస్తారు భరించాలని అన్నారు. ఇందిరా గాంధీ విధానం నుంచి కాంగ్రెసు నాయకులు వైదొలిగారని, సీమాంధ్రకు అన్యాయం చేశారని, వారు ఈ రోజుకు ఒక్కసారి కూడా క్షమాపణలు చెప్పలేదని, వారికి అహంకారమని, ఉత్తరాది అహంకారమని , ఆ ఉత్తరాది అహంకారం మీద తన పోరాటమని అన్నారు. మేం భారతీయులం కాదా, మీరేనా భారతీయులు అని అన్నారు. ఈ వివక్ష ఎందుకు అని అడిగారు. ఎందుకు అనే పదాన్ని పలు మార్లు ఆయన వత్తి పలికారు.
చాలా ఇబ్బందుల్లో ఉన్నామని తెలుగుదేశం పార్టీ నాయకులతో చెప్పానని, చేయని పనికి తెలంగాణ నాయకుల తీరుకు సీమాంధ్ర ప్రజలు బాధపడ్డారని చెప్పానని, దిగజారుడు రాజకీయం చేశారని, కొత్తగా రాష్ట్రం ఏర్పడుతుంది మీకు అందమైన పాలన కావాలని చెప్పి తన వంతు కృషి చేస్తానని చెప్పి ఎన్నికల్లో మద్దతు ఇచ్చానని అన్నారు.
అధికారం మీద పిచ్చ ఉంటే...
అధికారం మీద పిచ్చ ఉంటే, అధికార దాహం ఉంటే తానే సమైక్యాంధ్ర ఉద్యమం నడిపేవాడినని అన్నారు. తెలంగాణ అంటే తనకు ప్రేమ కాబట్టే తాను చేయలేదని అన్నారు. తెలంగాణ కష్టాలు చాలా దగ్గరి నుంచి చూశానని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పవన్ కల్యాణ్ తెలంగాణ గురించి నీకేం తెలుసురా అని అడిగారని, తన మిత్రుడు మాష్టార్జీ ఓ పాట పాడారని, ఊరు దొరలకు ఉంపుడు గత్తెలు అని పాడారని చెప్పారు.
ఇలాంటి వాటికి తాను భయపడనని చెప్పానని, మీరు నాకు గుండెల్లో ఇచ్చిన పదవి కన్నా ఏ పదవీ గొప్పది కాదని అన్నారు. అప్పుడు తెలంగాణ నాయకులు సీమాంధ్ర నాయకులను తిట్టారని అన్నారు. గుంటూరు శేషేంద్ర శర్మ కవితను ఉటంకించారు.
వంగి సలాం చేయలేడు...
ఆత్మగౌరవం ఉన్న ఓ తెలుగోడు ఢిల్లీ పెద్దలకు వంగి సలాం చేయలేడని అన్నారు. కేంద్రం వద్ద తమ ఆత్మగౌరవం తాకట్టు పెట్టవద్దని, అధికార ప్రతిపక్షాలు పోరాటం చేసి అలసిపోయి మా వాళ్ల కాదన్నప్పుడు తమకు వదిలిపెట్టాలని, తమ జనసేనకు వదిలిపెట్టాలని, అప్పుడు ఏం చేస్తామో చూపిస్తామని అన్నారు.
వెంకయ్యనాయుడిని ప్రస్తావిస్తూ ఓట్ల కోసం వచ్చినప్పుడు మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతారని పవన్ కల్యాణ్ అన్నారు. బిజెపి పాలనలో అందరూ హ్యాపీగా ఉంటారని ఆయన చెప్పారు. ఎక్కడ హ్యాపినెస్ లేదని, కన్నీళ్లూ ఏడ్పులూ మాత్రమే ఉన్నాయని పవన్ కల్యాణ్ అన్నారు.
ఓట్లు అడిగేటప్పుడు అర్థమయ్యే భాషలో మాట్లాడుతారు, ఏదైనా ఇవ్వాల్సిన వచ్చినప్పుడు అర్థం కాని భాషలో మాట్లాడుతారని అన్నారు. బిజెపి ఎవరికీ న్యాయం చేయడం లేదని అన్నారు. బిజెపి నాయకులు పార్టీ తీర్మానానికి ఇచ్చిన విలువ పార్లమెంటులో ఇచ్చిన మాటలకు లేదా అని అడిగారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు, ఏ పార్టీ నాయకులు వచ్చినా ఒక్కటే అడగాలని, ఈ పాచీలు వద్దని చెప్పాలని ఆయన ప్రజలకు చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారని, పిల్లలను తీసుకురావాలో వద్దో తెలియదని, ఇల్లు మారాలంటేనే ఎంతో కష్టం ఉంటుందని, ప్రభుత్వం వారిని ఆదుకోవాలని అన్నారు.
ఇంకా మీ ఆంధ్రోళ్లు పోరా అని అడుగుతున్నారని సీమాంధ్ర ఉద్యోగులు అంటున్నారని, వారిని పట్టించకోకుండా రాజధాని నిర్మాణం మీదనే దృష్టి పెట్టి సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. మీరు చేస్తారా లేదా చెప్పాలని, కేంద్రంతో పోరాటం చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
అవంతి శ్రీనివాస్‌కు సవాల్, వెంకయ్య నాయుడిపై సెటైర్లు...
ప్రజారాజ్యం పార్టీలో తానే ఎంపి కావాలనుకుంటే తానే తీసుకుంటానని, రాజకీయాలు మీరు బాగా చేస్తారనే కదా మిమ్మల్ని పంపించామని, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడదలుచుకుంటే అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయాలని అన్నారు. అనకాపల్లిలో కూర్చుకుని తాను గెలిపిస్తానని, ఆ బాధ్యత తీసుకుంటానని ఆయన అన్నారు. అవంతి శ్రీనివాస్ స్ఫూర్తిగా నిలువాలని అన్నారు. మీరు పోటీ చేస్తే తాను పోటీ చేయబోనని అన్నారు.
వెంకయ్యనాయుడు పెద్దవారు, ఆయనంటే గౌరవమని, పెద్దరికమనే ముసుగేసుకుని సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తుంటే తాను ఎదురు తిరుగుతున్నానని, అందుకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. వెంకయ్యనాయుడూ.. మీరు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకపోతే నెల్లూరుకు వెళ్లి సింధును సత్కరిస్తున్నారని, తెలుగు రాష్ట్రాల గౌరవాన్ని ఇనుమడింపజేశారు కాబట్టి తీసుకుని వెళ్తున్నారని అన్నారు. మీరేం చేశారు జాతి గౌరవాన్ని ఇనుమడింప జేయడానికి యువత అడుగుతారని అన్నారు. మీరు లొంగిపోతే ఆయనేరా మనలను వంచిందని ప్రజలు అంటుంటారని అన్నారు. రెండు చేతుల్లో రెండు లడ్డూలు పెట్టారని అంటారని పవన్ కల్యాణ్ అన్నారు.
మురళీమోహన్ వ్యాపారంపై.....
మురళీ మోహన్ వ్యాపారం చేసి సంపాదించారని, వ్యాపారం చేయడాన్ని తాను తప్పు అని చెప్పలేదని, ఎదడానికి తాను వ్యతిరేకం కాదని, మొక్కలు కూడా ఎదుగుతున్నాయి, మీరు ఎదుగుతుంటే ఎందుకు ఆపుతానని ఆయన అన్నారు. వ్యాపారంలో చూపించే దక్షత, సమర్థత ప్రజల సమస్యలను పరిష్కరించడంలో చూపించాలని అన్నారు. కాంట్రాక్టులు ఏమయ్యాయి అని పార్లమెంటులో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎలా అని అడిగారు. మీరు ప్రజలను కష్టపడుతూ ఉంటే తనకు కోపమేనని అన్నారు. స్వంత లాభం కొంతైనా మానుకుని ప్రజలకు మేలు చేయాలని కోరుతున్నానని ఆయన అన్నారు.
అన్నయ్యను, వదినను కాదన్నాను...
అన్నయ్యను, వదినను, అమ్మను, అక్కాచెల్లెళ్లను కాదని తెలుగుదేశం, బిజెపికి కొమ్ము కాసి ప్రాణాలు ఫణంగా పెట్టి ముందుకు వచ్చానని, గద్దె మీద కూర్చుని చేయనంటే తాను అంగీకరించబోనని, ఒక్క జనసేన సైనికుడు కూడా ఒప్పుకోడని అన్నారు. కాంగ్రెసు చేసిన తప్పిదాలను బిజెపి చేయకూడదని కెవిపి రామచంద్రరావు చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ భూసేకరణ చట్టం తెచ్చారని, దాన్ని జైరాం రమేష్‌తో కలిసి రాశారని, 2004 నుంచి ఇస్తామని చెప్పిన కాంగ్రెసు నాయకులు రాజధానిని ముందే ఎందుకు నిర్ణయించలేదని అన్నారు. మెడ పట్టి తోసి తోసి మాకు కడుపు మంట కలిగించారని అడిగారు. పౌరుషం లేదా అని అడిగారు.
రాజకీయ నాయకులకు సమగ్రత లేదా, ప్రజలు వారిని నిలబెట్టాలని అన్నారు. తమ నుంచి వారు తప్పించుకోలేరని అన్నారు. టిజి వెంకటేష్ కుంభకర్ణుడు అని అన్నారని, తాను తలుచుకుంటే తాను మాట్లాడగలనని అన్నారు. మీలా అవకాశవాద రాజకీయాలు చేయనని ఆయన టిజి వెంకటేష్‌ను ఉద్దేశించి అన్నారు.
బిజెపిని వెంకయ్య చంపేశారు...
వెంకయ్య నాయుడు బిజెపిని చంపేశారని, తాము వేరే పార్టీని వెతుక్కోవాల్సి ఉంటుందని అన్నారు. జాతీయ నాయకుల మనవళ్లు, మనవరాళ్లు వస్తే పత్రికల్లో రాదని, తెలంగాణలోనూ సీమాంధ్రలోనూ చనిపోయిన యువత గురించి ఇంగ్లీష్ పత్రికల్లో రాదని అన్నారు. గతంలో రాజుల మాదిరిగానే ఇప్పుడు సీమాంధ్ర ఎంపీలు వారికి కొమ్ము కాస్తున్నారని, దాన్ని బలంగా ఎదుర్కుంటామని చెప్పారు. పాలకులు చేసిన తప్పులకు యువత బాధపడకూడదని అన్నారు.
అప్పుడొస్తా...
ఏం చేస్తారు కాకినాడకు వచ్చి అంటే ఆమరణ దీక్ష చేయాలా అని అడిగారు. తాను రాజకీయ డ్రామాలు చేయనని, దిగాక తాడో పేడో తేల్చుకుంటానని అన్నారు. మీరు పోరాటం చేయాలని అడిగారు. మీరు ఓడిపోయిన తర్వాత తాను దిగుతానని అన్నారు. సిపిఎం వాళ్లు తాము రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని అన్నందుకు తనకు వారి మీద గౌరవం పెరిగిందని అన్నారు. వారితో కలిసి ఎలా పోరాటం చేయాలనే విషయం ఆలోచిస్తానని అన్నారు. రాజకీయ నాయకులు పోరాటం చేయడానికి రానప్పుడు తాను వస్తానని, ప్రజల తరఫున తాను పోరాటం చేస్తానని చెప్పారు.
దేశభక్తి ఉత్తర భారతీయులకే కాదు, భారత రాజ్యాంగంపై వారికి ఎంత గౌరవం ఉందో మనకూ అంతే ఉందని అన్నారు. ఢిల్లీకి వినిపించేలా జైకొడుతామంటూ భారత్ మాతాకీ జై అంటూ పవన్ కల్యాణ్ నినాదాలు చేశారు.
విభజన సమయంలో కాంగ్రెస్ ఆంధ్రుల వెన్నులో పొడిస్తే ఆదుకుంటుందనుకున్న బీజేపీ పొట్టలో పొడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలను బీజేపీ నిలబెట్టుకోలేకపోయిందన్నారు. వారు ఒప్పుకోవడం లేదని, వీరు ఒప్పుకోవడం లేదని చెప్పడం సరికాదని అన్నారు.












Click it and Unblock the Notifications