పవన్ కళ్యాణ్ కు వైరల్ ఫీవర్ ! టీడీపీతో పొత్తుపై జనసేన భేటీ వాయిదా !
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అస్వస్ధతకు గురయ్యారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో రేపు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరగాల్సిన జనసేన విస్తతస్ధాయి భేటీ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వరుసగా వారాహి యాత్రతో పాటు షూటింగ్స్ తోనూ బిజీగా గడుపుతున్న పవన్ కు అస్సలు విశ్రాంతి లేకుండాపోయింది. దీంతో తాజాగా వెన్నునొప్పితో కూడా బాధపడ్డారు.

ఈ మధ్యే కృష్ణాజిల్లాలో వారాహి నాలుగోదశ యాత్రను ముగించుకున్న పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన కీలక నేతలతో భేటీ అయ్యారు. అందులో టీడీపీతో కలిసి వెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అనంతరం జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ కోసం ఐదుగురు నేతలతో కమిటీని కూడా ప్రకటించారు. దీనిపై తదుపరి చర్చలు రేపు నిర్వహించాల్సి ఉంది.అంతలోనే పవన్ అస్వస్ధతకు గురయ్యారు.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్లిపోయాక తిరిగి షూటింగ్స్ లో బిజీ అయిపోయారు. అయితే వైరల్ ఫీవర్ సోకడంతో షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి రేపు మంగళగిరిలో జనసేన విస్తృత స్ధాయి భేటీలో పాల్గొనేందుకు ఇవాళ సాయంత్రమే ఆయన విజయవాడ చేరుకోవాల్సి ఉంది. కానీ జ్వరం కారణంగా రేపటి భేటీని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ భేటీ కోసం మరో తేదీని ప్రకటిస్తామని నేతలకు సమాచారం ఇచ్చారు.
టీడీపీ-జనసేన పొత్తు ప్రకటన తర్వాత ఇరుపార్టీల నుంచి జాయింట్ యాక్షన్ కమిటీని ప్రకటించాలని నిర్ణయించారు. అయితే జనసేన తరఫున కమిటీని ప్రకటించినా టీడీపీ నుంచి మాత్రం కమిటీ సభ్యులు ఫైనల్ కాలేదు. కేవలం సీనియర్ నేత యనమల రామకృష్ణుడిని మాత్రమే ఎంపిక చేశారు. చంద్రబాబు జైల్లో ఉన్న నేపథ్యంలో ఈ కమిటీపై అడుగులు వేగంగా పడటం లేదు.












Click it and Unblock the Notifications