పీకే డైరెక్షన్ తోనే పవన్ పై లోకేష్ వ్యాఖ్యలు - జనసైనికుల ఆగ్రహం..!!
ఏపీ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తులో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ నేత నారా లోకేష్ అసలు సీఎంగా పవన్ కు ఛాన్స్ లేదంటూ చేసిన వ్యాఖ్యల పై పవన్ మద్దతు దారులు రగిలిపోతున్నారు. ఈ వ్యాఖ్యలు ఉద్దేశ పూర్వకంగానే చేసినట్లు భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకే లోకేష్ ఇలా కామెంట్స్ చేసారని చెబుతున్నారు. పవన్ కు ప్రాధాన్య తగ్గిస్తే సహించేది లేదని జనసైనికులు స్పష్టం చేస్తున్నారు.
వ్యాఖ్యలపై ఆగ్రహం : కీలకమైన ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇద్దరు పార్టీ అధినేతలు చర్చల ద్వారా నిర్ణయం తీసుకోవాలి. ఇద్దరినీ కాదని లోకేష్ ఏకపక్షంగా సీఎం చంద్రబాబే అని ఎలా ప్రకటిస్తారని జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును జైల్లో ఉన్నపుడు సంఘీభావం ప్రకటించి పొత్తు గురించి చంద్రబాబుతో చర్చించిన తర్వాతనే పొత్తు వివరాలను ప్రకటించి పవన్ కళ్యాణ్ గౌరవప్రదంగా ఉంటే ఇపుడు లోకేష్ ఇలా ప్రకటన చేయడమేమిటని జనసైనికులు నిలదీస్తున్నారు. టీడీపితో కలిసి ఉండడం కోసం ఎన్నో అవమానాలు భరిస్తూనే ఉన్నామని వాపోతున్నారు. అటు కేంద్రంలో బీజేపితో కూడా వైరం పెట్టుకుని త్యాగానికి సిద్దపడితే ఇపుడు ఇంతలా అవమానపరచడం చంద్రబాబుకే చెల్లిందని జనసేన క్యాడర్ ఫైర్ అవుతున్నారు.

ఏం జరుగుతోంది : ప్యాకేజ్ తీసుకుంటున్నారని, జనసేనను టీడీపీ దగ్గర తాకట్టుపెట్టారనే ఆరోపణలు వస్తున్న మౌనంగా భరిస్తూ వస్తున్నామని ఇక ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని పార్టీ క్యాడర్ బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పవన్ కు ఉన్న క్యాడర్, ప్రజాభిమానం, యువత...అభిమానులు వీళ్ళను చూసే కదా ఆయనకు చంద్రబాబు అయినా కేంద్రంలోని మోడీ విలువ ఇచ్చారని...ఇప్పుడు వారి మనోభావాలు దెబ్బ తినేలా టీడీపీ వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కూడా చంద్రబాబే సీఎం డిసైడ్ అయ్యారని లోకేష్ చెప్పటం వెనుక వాస్తవం ఏంటనేది ఇప్పుడు వారిలో చర్చకు కారణమవుతోంది. దీంతో, పవన్ కోరిన సీట్లు అయినా దక్కుతాయా..లేక చంద్రబాబు ఇచ్చిన సీట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తుందా అంటూ వాపోతున్నారు.

ఎందుకు స్పందించరు : మున్ముందు మనకు సరిగా గౌరవించకుంటే మనదారి మనం చూసుకోవడం మేలు అనే భావనలో జనసైనికులు వచ్చేసారు. ఇదే సమయంలో తాము ఇంత ఆవేదన చెందుతుంటే పవన్ లేదా పార్టీ నేతలు ఎవరూ స్పందించటం లేదనే చర్చ పార్టీ అభిమానుల్లో మొదలైంది. పార్టీలో ఏ నేత లోకేష్ వ్యాఖ్యల పైన గట్టిగా స్పందించలేరా అనే సందేహాలు మొదలయ్యాయి. యువగళం ముగింపు సభలోనూ అవసరానికి మించి నాదెండ్ల మనోహర్ టీడీపీ నేతలను, లోకేష్ పైన ప్రశంసలు కురిపించటం పైన కేడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ వేళ చోటు చేసుకుంటున్న పరిణామాలు నిశితంగా గమనిస్తున్నారు. దీంతో..రాజకీయంగా రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications