థియేటర్ల బంద్ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్-సొంత పార్టీ నేతపై పవన్ వేటు..!
ఏపీలో సినిమా థియేటర్ల బంద్ పిలుపు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిర్మాతలతో విభేదాల నేపథ్యంలో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఉమ్మడిగా జూన్ 1 నుంచి రాష్ట్రంలో సినీ థియేటర్ల బంద్ కు పిలుపునివ్వడం, పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరి హర వీరమల్లు విడుదల వేళ ఈ పిలుపు రావడంపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేయడం, హెచ్చరికలతో వారు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత దీని వెనుక ఉన్నారని భావిస్తున్న నలుగురు టాలీవుడ్ పెద్దల్లో ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టి తమ పాత్ర లేదని చెప్పేశారు.
అయితే ఇందులో ఒకరైన దిగ్గజ నిర్మాత దిల్ రాజు జనసేన నేత పాత్ర ఇందులో ఉందని చెప్పడంతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడింది. ఈ నేపథ్యంలో థియేటర్ల బంద్ పిలుపు వెనుక జనసేన నేతలు ఉన్నా వదిలిపెట్టొద్దని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జనసేన నేత అత్తి సూర్యనారాయణ ఈ పిలుపు ఇచ్చినట్లు వార్తలు రావడంతో ఆయనపై వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది.


అవాంఛనీయమైన థియేటర్ల బంద్ నిర్ణయంలో మీరు భాగస్వాములేనని మీపై తీవ్ర ఆరోపణలు వచ్చినందున జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు మిమ్మల్ని రాజమండ్రి నగర నియోజకవర్గం ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా ?, అసత్యమా అని మీరు నిరూపించుకునే వరకూ మీరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు పార్టీ సంక్షోభ నిర్వహణ విభాగం అధ్యక్షుడిగా ఉన్న వేములపాటి అజయ్ కుమార్ ఓ ప్రకటన చేశారు.
దీంతో ఏపీలో థియేటర్ల బంద్ పిలుపు వెనుక ఉన్నది జనసేన నేతే అన్న నిర్మాత దిల్ రాజు మాటలు నిజమేనని అర్ధమవుతోంది. ఈ విషయం తెలియక పవన్ కళ్యాణ్ తన సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ వేళ ఎవరో కుట్ర చేశారంటూ విమర్శలకు దిగడం, ఆయన పార్టీ మంత్రి కందుల దుర్గేష్ అయితే హోంశాఖ కార్యదర్శికి లేఖ రాసి మరీ విచారణ కోరడం చేశారు. ఇప్పుడు థియేటర్ల మూసివేత వెనుక తాము లేమంటూ టాలీవుడ్ నలుగురిలో ఇద్దరు మీడియా ముందుకు రావడం, అందులో ఒకరైన దిల్ రాజు జనసేన నేత పాత్రపై ఆరోపణలు చేయడంతో పార్టీతో పాటు పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్ ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. దీంతో ఇవాళ సదరు నేతపై వేటు వేశారు.












Click it and Unblock the Notifications