ప్రచార ఆర్భాటమే తప్ప ఆడబిడ్డలకు రక్షణేది? జగన్ ప్రభుత్వాన్ని నిలదీసిన పవన్ కళ్యాణ్!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహిళల, బాలికల రక్షణ విషయంలో పదేపదే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. గతంలోనూ పలుమార్లు మహిళల రక్షణ విషయంలో, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాల విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా మరోమారు ప్రభుత్వాన్ని నిలదీశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోని అధికార ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో జగన్ సర్కార్ విఫలం అవుతుంది అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన పవన్ కళ్యాణ్ మహిళలకు రక్షణ కల్పించలేని పాలన ఎందుకు అంటూ ప్రశ్నించారు.

ప్రభుత్వం మౌనం .. ఆడబిడ్డలకు శాపం : పవన్ కళ్యాణ్
ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని పవన్ కళ్యాణ్ నిలదీశారు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల్లో ఏపీ మొదటి పది స్థానాల్లో ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయినా ప్రభుత్వం మౌనంగా ఉదాసీనంగా ఉండటం ఆడబిడ్డలకు శాపంగా మారిందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు .

పాలకుల పట్టింపులేని తనం వల్లే నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు
ఉత్తరాంధ్రలోని అచ్యుతాపురం సెజ్ లో ఉపాధి కోసం వచ్చిన గిరిజన మహిళపై, పల్నాడులోని నాగార్జునసాగర్ దగ్గర ఆశ కార్యకర్త గా ఉన్న గిరిజన మహిళ పైన చోటుచేసుకున్న అత్యాచారం హత్య ఘటనలు తన మనసును కలచి వేశాయి అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని తెలిపారు. మహిళల మాన మర్యాదలకు భంగం వాటిల్లే సంఘటనలు రాష్ట్రంలో తరచూ చోటుచేసుకుంటున్నా పాలకులు పట్టించుకోకపోవడంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు అని పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు.

హోం మంత్రిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ .. ప్రచార ఆర్భాటాలేనా
అత్యాచారం వంటి ఘటనలపై బాధ్యతతో తీవ్రంగా స్పందించాల్సిన హోంమంత్రి సైతం తల్లి పెంపకం లోనే తప్పు ఉందని ఏదో దొంగతనానికి వచ్చి అత్యాచారం చేశారని వ్యాఖ్యలు చేస్తూ తేలికగా మాట్లాడటం వల్లే మృగాళ్లు రెచ్చిపోతున్నారు అని, పెట్రేగి పోతున్నారని పవన్ కళ్యాణ్ హోం మంత్రిని టార్గెట్ చేశారు.మహిళలకు రక్షణ ఇవ్వలేని పాలన ఎందుకు అని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ దిశా చట్టాలు చేశాము.. పోలీస్ స్టేషన్లను పెట్టామని ప్రచార ఆర్భాటం తప్ప ఆడబిడ్డలకు మాత్రం ధైర్యం ఇవ్వలేకపోతున్నారు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

జగన్ ఇంటికి కూతవేటు దూరంలో యువతిపై అత్యాచారం.. నేటికీ కేసు అతీగతీ లేదు
రాష్ట్ర పాలకుడు అయిన జగన్మోహన్రెడ్డి ఇంటికి సమీపంలోనే ఒక యువతిపై కృష్ణా నది ఒడ్డున అత్యాచారం జరిగి ఏడాది దాటినా ఇప్పటికీ ఓ నిందితుడిని పట్టుకోలేకపోయారు అంటే రాష్ట్రంలో పోలీసింగ్, శాంతిభద్రతల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నేటికీ ఈ కేసు అతీగతీ లేదని పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రం లో మహిళలపై జరుగుతున్న నేరాలు రోజురోజుకీ పెరగడం కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే అని పవన్ కళ్యాణ్ ప్రభుత్వ అసమర్థ పాలనను తన ప్రకటన ద్వారా ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications