సీఎం జగన్ సొంతజిల్లాకు పవన్ కళ్యాణ్.. ఆగస్ట్ 20న సిద్ధవటంలో జనసేనాని రచ్చబండ!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన ఉమ్మడి కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 20వ తేదీన ఉమ్మడి కడప జిల్లాలో జనసేన పార్టీ నిర్వహించనున్న రైతు భరోసా యాత్ర లో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన 176 మంది కౌలు రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం అందించనున్నారు. సిద్ధవటం లో జరగనున్న సభలో పవన్ కళ్యాణ్ రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇక ఈ మేరకు 20వ తేదీన జరగనున్న కౌలు రైతు భరోసా యాత్ర విజయవంతం చేయడం కోసం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి కడపకు వెళ్లారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.

ప్రభుత్వ వైఖరి వల్లే రైతుల ఆత్మహత్యలు .. కౌలు రైతులకు అండగా జనసేనాని
ఈ సందర్భంగా మాట్లాడిన నాదెండ్ల మనోహర్ వైసిపి సర్కారు తీరుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి మొండి వైఖరితో తీసుకువచ్చిన కొత్త కౌలు సాగు చట్టమే కౌలు రైతుల ఉసురు తీసిందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. భూ యజమానుల అనుమతి ఉంటేనే లోన్లు అంటూ చేసిన మోసపూరిత చట్టం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా దక్కని పరిస్థితుల్లో కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారి కుటుంబాలను ఆదుకుని, రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇవ్వటం కోసం కౌలు రైతు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.

ఉమ్మడి కడప జిల్లాకు రేపు పవన్ కళ్యాణ్
ఈ నెల 20వ తేదీన ఉమ్మడి కడప జిల్లాలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర లో భాగంగా పవన్ కళ్యాణ్ ఉదయం 12 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి నేరుగా సిద్ధవటంలోని సభా ప్రాంగణానికి చేరుకుని జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన 176 కౌలు రైతు కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందచేస్తారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతాంగానికి అండగా నిలబడే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఇప్పటికే అనంతపురం, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాలోనూ పూర్తయ్యిందని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ సొంత నిధుల నుండి కౌలు రైతు భరోసా యాత్రకు 5 కోట్ల నిధులు
కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మొదటి విడత కార్యక్రమం పూర్తయ్యింది. కర్నూలు జిల్లాలో మరో రెండు విడతలు కార్యక్రమం నిర్వహించాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సొంత నిధుల నుంచి పవన్ కళ్యాణ్ రూ. 5 కోట్లు ఇచ్చారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో సహా ఎంతో మంది ఈ కార్యక్రమానికి తమవంతు సాయం అందించారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

వైసీపీ పాలన అధ్భుతమైతే రైతుల ఆత్మహత్యలు దేనికి ?
అంతేకాదు జగన్ రెడ్డి బటన్ లు నొక్కి అద్భుతంగా సంక్షేమ అందిస్తున్నామని చెబుతున్నారని, అయితే వైసీపీ పాలన అంత అద్భుతంగా ఉంటే ఇంత మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. 6,300 కోట్లు రూపాయలు ఖర్చు చేసి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని, ఏ ఒక్క కేంద్రంలోనూ మార్కెటింగ్ సౌకర్యాలు లేవని, ఎరువులు, విత్తనాలు ఇవ్వడంలేదని, రైతు భరోసా కేంద్రాలు ఉత్త బూటకమని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం పారదర్శకత లేకుండా పాలన సాగిస్తున్నారని, రైతులకు లాభం మాట అటుంచి వ్యవసాయాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారు ఆయన విమర్శించారు.

జగన్ సీఎం అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది కౌలు రైతుల ఆత్మహత్యలు
జగన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 176 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే, ఆయన సొంత నియోజకవర్గంలో 46 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం వైసిపి పాలనకు అద్దం పడుతుందని మండిపడ్డారు. ఇక రైతులను కులాల వారిగా విడగొట్టి ప్రభుత్వం నుంచి వచ్చే సాయం అందరికీ రాకుండా చేశారని, ముఖ్యమంత్రి పనితీరు ఎవరికీ అర్థం కాకుండా ఉందని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.

సిద్ధవటంలో పవన్ కళ్యాణ్ సభ విజయవంతం చెయ్యాలని దిశా నిర్దేశం
గతంలో కడపలో వరదలు వచ్చినప్పుడు కూడా జనసేననే ముందు స్పందించిందని, వరదలు వచ్చి సంవత్సరం గడిచినా ఇప్పటికీ ఇక్కడ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదని ఆయన మండిపడ్డారు. వరద సాయం కొంతమందికే ఎందుకు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఇక ఇదే సమయంలో సిద్ధవటంలో జరగనున్న సభను విజయవంతం చేయాలని జన సైనికులకు సూచించారు. పవన్ కళ్యాణ్ కౌలు రైతుల భరోసా యాత్రను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. సభకు వచ్చిన ఎవరికీ ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని, ప్రజల్లోకి తీసుకు వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించాలని నాదెండ్ల మనోహర్ పార్టీ శ్రేణులకు సూచించారు.












Click it and Unblock the Notifications