Pawan Kalyan : 2024లో పవన్ కళ్యాణ్ పోటీ అక్కడే ? ఆ రెండు సీట్లలోనూ ! ఐదు జిల్లాల టార్గెట్ !
2024 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి రెండు చోట్ల నుంచి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు.
ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరోసారి అదే ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంతే కాదు పవన్ పోటీ చేసే నియోజకవర్గాలు కూడా సిద్దమైపోయాయి. తాజా సమాచారం మేరకు ఆ రెండు నియోజకవర్గాల్లో పవన్ ఈసారి పోటీ చేస్తే రెండు చోట్ల నుంచి గెలుపు అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నట్లు స్ధానికంగానే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ రెండు నియోజకవర్గాలపై ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది.

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్
గతంలో పాతికేళ్ల రాజకీయమంటూ జనసేన పార్టీ పెట్టి తొలిసారి పోటీ చేయకుండా టీడీపీకి మద్దతిచ్చిన పవన్.. రెండోసారి ఎన్నికల్లో మాత్రం జనసేనను ఒంటరిగా బరిలోకి దింపి.. తాను రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓటమితో సరిపెట్టుకున్నారు. దీంతో ముచ్చటగా మూడోసారి ఎన్నికల్లో పవన్ ఏం చేయబోతున్నారన్న ఆసక్తి పెరుగుతోంది. అదే సమయలో రాష్ట్రంలో కాపు సీఎం డిమాండ్ కూడా అంతకంతకూ ఊపందుకుంటోంది. ఎప్పుడూ కమ్మ, రెడ్లేనా.. ఈసారి కాపులకు రాజ్యాధికారం దక్కాల్సిందేనన్న పట్టుదల ఆ సామాజిక వర్గంలో కనిపిస్తోంది. దీంతో పవన్ అడుగులకు ప్రాధాన్యం పెరుగుతోంది.

మళ్లీ రెండుచోట్ల నుంచి పోటీ ?
2019 ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్.. తన పోటీ కోసం రెండు నియోజకవర్గాలు ఎంచుకున్నారు. వీటిలో ఒకరు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కాగా.. మరొకటి విశాఖ జిల్లా గాజువాక. ఈ రెండు చోట్ల నుంచి పోటీ చేసినా ఒక్క చోట కూడా పవన్ గెలవలేదు. దీంతో ఈసారి ఆచితూచి అడుగులేస్తున్నారు. అయితే రెండు నియోజకవర్గాల నుంచి పోటీకే పవన్ మరోసారి మొగ్గుచూపుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాలు కూడా గోదావరి జిల్లాల నుంచే ఉండేలా పవన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కాకినాడ రూరల్లో పవన్ పోటీ ?
ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీ నుంచి మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే 2024లో మరోసారి ఆయన ఇదే సీటు నుంచి బరిలో ఉంటారు. దీంతో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కన్నబాబును ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే పవన్ వైసీపీపై విమర్శలు చేసినప్పుడల్లా కౌంటర్లు ఇస్తున్న కన్నబాబు.. నేరుగా పవనే తనకు ప్రత్యర్దిగా ఎదురైతే ఏం చేస్తారనేది ఆసక్తి రేపుతోంది. అలాగే టీడీపీ-జనసేన పొత్తు ఉన్నా లేకున్నా కాకినాడ రూరల్ లో పవన్ గెలుపు నల్లేరుపై నడకగానే కనిపిస్తోంది.

పిఠాపురం బరిలోనూ పవన్ ?
అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం సీటు నుంచి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాకినాడ రూరల్ తో పాటు పిఠాపురం కూడా కన్ఫమ్ అయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సిట్టింగ్ గా ఉన్నారు. ఆయన ఆరోగ్య కారణాలతో పోటీకి దూరమైతే తాను బరిలో ఉండాలని కాకినాడ ఎంపీ వంగా గీత సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో పవన్ పోటీకి దిగితే వంగా గీత రాకపోవచ్చని అంటున్నారు. కాకినాడ రూరల్, పిఠాపురం రెండు నియోజకవర్గాల్లో పవన్ ఒకేసారి పోటీ చేస్తే కచ్చితంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న మూడు కొత్త జిల్లాలతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వస్తున్న రెండు కొత్త జిల్లాల్లోనూ ఆ ప్రభావం పడుతుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications