ఈ ఎన్నికల్లో పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో వెల్లడించిన జనసేన నేత
TDP BJP alliance: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష తెలుగుదేశం.. మరోసారి భారతీయ జనతా పార్టీని ఆశ్రయించింది. బీజేపీ సారథ్యాన్ని వహిస్తోన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో చేరింది. ఈ విషయాన్ని రెండు పార్టీల అధినేతలు అధికారికంగా వెల్లడించారు.
ఆరు సంవత్సరాల తరువాత తెలుగుదేశం పార్టీ మరోసారి ఎన్డీఏలోకి రీ ఎంట్రీ ఇచ్చినట్టయింది. వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి తెలుగుదేశం- జనసేన- బీజేపీ మహా కూటమి కట్టాయి. ఉమ్మడిగా బహిరంగ సభలను నిర్వహించబోతోన్నాయి. వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనబోతోన్నాయి.

ఈ పరిస్థితుల మధ్య తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, భీమవరం మాజీ శాసన సభ్యుడు పులపర్తి రామాంజనేయులు అలియాస్ అంజిబాబు.. జనసేనలో చేరారు. కొద్దిసేపటి కిందటే ఆయన పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొన్నారు. 2009లో భీమవరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో అదే భీమవరం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.
2019లో భీమవరంలో ఓడిపోయారు. మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఇప్పుడు మళ్లీ పార్టీ ఫిరాయించారు. జనసేన తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు పులపర్తి అంజిబాబు. వచ్చేది టీడీపీ- జనసేన- బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

తనను పార్టీలో చేర్చుకున్నంత మాత్రాన భీమవరం టికెట్ తనకు ఇచ్చినట్లు కాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్.. భీమవరం నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తారని తేల్చి చెప్పారు. ఈ దఫా ఆయన ఓడిపోరని, అత్యంత భారీ మెజారిటీతో ఘన విజయం సాధిస్తారని అన్నారు.
పవన్ కల్యాణ్‌ను గెలిపించడానికి యువత ముందుకు రావాలని చెప్పారు. 2029లో పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందామని, దాని కోసం తాను రెట్టింపు కష్టపడతానని రామాంజనేయులు అన్నారు. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలనేదే తన కోరిక అని పేర్కొన్నారు.
కళ్యాణ్ గారే భీమవరంలో పోటీ చేస్తారు! - మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు 🥺❤️@JanaSenaParty @PawanKalyan pic.twitter.com/XLhj7ml4T6
— JSP WestGodavari (@JSPWestGodavari) March 12, 2024
2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పదని, రాక్షస పాలనను అంతమొందించి, రామరాజ్యాన్ని స్థాపించుకుందామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలనలో భీమవరంలో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొని ఉన్నాయని, నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications