రూ. 130 చెల్లించండి: ఏపీ ప్రభుత్వానికి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అల్టిమేటం
అమరావతి: పాల సరఫరా విషయంలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(కేఎంఎఫ్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం వెంటనే రూ. 130 కోట్ల పాల బకాయిలు చెల్లిస్తే గానీ.. అక్కడి అంగన్వాడీలకు పాలు సరఫరా చేయలేమని కేఎంఎఫ్ స్పష్టం చేసింది. అంతేగాక, ఇకపై పాల ధరను కూడా లీటరుకు రూ. 5 చొప్పున పెంచుతున్నట్లు తెలిపింది.
కాగా, సంపూర్ణ పోషణ పథకం కింద అంగన్వాడీలకు పాల కోసం ఏపీ ప్రభుత్వం 2020 జూన్‌లో కర్ణాటక పాల సరఫరాదారుల సమాఖ్యతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పథకం ద్వారా చిన్న పిల్లలకు పాలు అందిస్తున్నారన్న కారణంతో లీటర్ ధరపై రూ. 5 తగ్గించేందుకు కూడా కేఎంఎఫ్ అంగీకరించింది.

ఈ ఒప్పందం ప్రకారం ప్రతినెలా 110 లక్షల లీటర్ల పాలను కేఎంఎఫ్ నుంచి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. అయితే, గత నాలుగు నెలలుగా ఏపీ సర్కారు.. కేఎంఎఫ్ కు ఎలాంటి చెల్లింపులు చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోయి రూ. 130 కోట్లకు చేరాయి. ఈ క్రమంలో ఈ బకాయిలు చెల్లించాలంటూ పలుమార్లు లేఖలు రాసినప్పటికీ ఏపీ సర్కారు నుంచి ఎలాంటి స్పందనా రాలేదని కేఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) బీసీ సతీష్ తెలిపారు.
ఇక పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ఇతర ఖర్చులు పెరిగిపోవడంతో ఏపీ ప్రభుత్వానికిచ్చే రూ. 5 సబ్సిడీని కూడా తొలగిస్తామని ఈ ఏడాది రూ. ఫిబ్రవరిలో కేఎంఎఫ్ తెలిపింది. దీనిపై కూడా ఏపీ సర్కారు స్పందించలేదని కేఎంఎఫ్ ఎండీ సతీష్ తెలిపారు. పెట్టుబడి ఖర్చులు, ఇంధన ధరలు పెరిగిపోవడంతో కర్ణాటక పాల యూనియన్లు నష్టాల్లో ఉన్నాయని, అందువల్ల పాత ధరకే పాలు సరఫరా చేయడం కుదరని ఏపీ ప్రధాన కార్యదర్వికి రాసిన లేఖలో కేఎంఎఫ్ ఎండీ సతీష్ తెలిపారు.
అంతేగాక, ఏపీ ప్రభుత్వం బకాయిలు పడ్డ కారణంగా పాల ఉత్పత్తిదారులకు సకాలంలో డబ్బులు చెల్లించలేకపోతున్నామని పేర్కొన్నారు. వెంటనే ఏపీ ప్రభుత్వం రూ. 130 కోట్ల బకాయిలు చెల్లించడంతోపాటు పాల ధరను లీటరుకు రూ. 5 పెంచితేనే ఇక మీదట సరఫరా చేయగలమని ఆ లేఖలో కేఎంఎఫ్ ఎండీ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications