విభజనపై దోషిగా నిలబడ్తారు: రాష్ట్రపతిపై పయ్యావుల
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై విలువలకు కట్టుబడకపోతే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దోషిగా నిలబడుతారని తెలుగుదేశం పార్టీ నాయకుడు పయ్యావుల కేశవ్ అన్నారు. విభజన బిల్లును శాసనసభకు పంపిస్తూ పది రోజులు మాత్రమే గడువు ఇవ్వాలని రాష్ట్రపతిపై ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. గతంలో రాష్ట్రాల విభజన విషయంలో రాష్ట్రపతి శాసనసభలకు 45 రోజులు గడువు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర విభజన విషయంలో రాష్ట్రపతి విలువలకు, సంప్రదాయాలకు కట్టుబడి వ్యవహరిస్తారనే నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో విభజన బిల్లును ప్రవేశపెడతామని చెప్పడానికి కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఎవరని ఆయన అడిగారు.

బిల్లును పార్లమెంటుకు ఎప్పుడు పంపాలో, ఎలా పంపాలో నిర్ణయం తీసుకునేది రాష్ట్రపతి మాత్రమేనని, రాష్ట్రపతి రబ్బర్ స్టాంపు అని తేల్చి షిండే ఆ ప్రకటన చేశారా అని ఆయన అన్నారు. రాష్ట్రపతి భవన్‌ను ఎఐసిసి కార్యాలయమని షిండే అనుకుంటున్నారా అని ఆయన అడిగారు.
శాసనసభలు తమ అభిప్రాయాలు చెప్పడానికి గతంలో మిగిలిన రాష్ట్రాలకు ఎంత సమయం ఇచ్చారో ఇప్పుడు కూడా అంతే సమయం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. శాసనసభ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అడుగు ముందుకు వేయాలని కేశవ్ సూచించారు.












Click it and Unblock the Notifications