గోదావరి జిల్లాల్లో సంక్రాంతి జోష్..! 3 రోజుల హోటల్ స్టే కు లక్ష ?
ఏడాదికి ఓసారి వచ్చే సంక్రాంతి పండుగ అంటేనే జోష్. అదీ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ అంటే ఇక చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడి పచ్చదనం మధ్య కోడి పందాలు ఆడుకుంటూ సరదాగా పిండివంటలు ఆరగిస్తూ సంక్రాంతి జరుపుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు. దీంతో ప్రతీ ఏటా సంక్రాంతి వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల రూపురేఖలే మారిపోతుంటాయి. ఈసారి కూడా అదే జోష్ తో సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు ఎక్కడెక్కడి నుంచో జనం తరలివస్తున్నారు.
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ ఒక ఎత్తు.. భీమవరంలో మరో ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ జరిగే కోడి పందాల్ని చూసేందుకు, ఆడేందుకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక నుంచి భారీగా జనం తరలివస్తుంటారు. వీరంతా మూడు రోజుల పాటు అక్కడే ఉండి కోడి పందాల్ని తిలకించేందుకు వీలుగా స్థానికంగా హోటల్స్ అద్దెకు తీసుకుని బస చేస్తారు. దీంతో ఈసారి కూడా హోటల్ రూమ్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది.

భీమవరంతో పాటు ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురంలో ఇప్పుడు హోటల్ గదులు పూర్తిగా బుక్ అయిపోయాయి. ఒక్కటంటే ఒక్క రూమ్ కూడా ఖాళీ లేదని తెలుస్తోంది. రోజుకు వెయ్యి నుంచి 5 వేలు ఉంటే హోటల్ అద్దె కాస్తా ఇప్పుడు 30 నుంచి 60 వేలకు చేరిపోయిందని చెప్తున్నారు. మూడు రోజులకు తీసుకుంటే గరిష్టంగా లక్ష వరకూ చెల్లించక తప్పడం లేదట. ఇందులో రాజకీయ నాయకులతో పాటు సాధారణ పర్యాటకులు కూడా భారీగానే బస చేస్తున్నారు.

మరోవైపు కోడి పందాలు కూడా ఈసారి భారీ ఎత్తున నిర్వహించేందుకు ఇక్కడికి భారీగా బెట్టింగ్ రాయుళ్లు తరలివస్తున్నారు. ఇందదులో పలువురు రాజకీయ నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోడి పందాల్ని భారీ ఎత్తున నిర్వహిస్తామని స్వయంగా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ప్రకటించడంతో ఇక్కడ జోష్ మరింత పెరిగింది. దీంతో పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా అవేవీ ఇక్కడ పనిచేయవని తేలిపోతోంది. వచ్చే నాలుగైదు రోజులు ఇక్కడ భారీ ఎత్తున కోడి పందాల నిర్వహణకు రంగం సిద్ధమైంది.












Click it and Unblock the Notifications