ఎన్టీఆర్ భరోసా పథకంపై 90 శాతం తృప్తి: లోకేష్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం పట్ల 90 శాతం మంది సంతృప్తిగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ అన్నారు. హైదరాబాదులోని లేక్‌వ్యూ అతిథి గృహంలో పార్టీ ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు విడతల వారీగా నిర్వహించిన భేటీలో ప్రభుత్ పాలనపై చేసిన సర్వే వివరాలను ఆయన వెల్లడించారు.
చంద్రన్న సంక్రాంతి కానుక పట్ల 85 శాతం మంది సంతృప్తిగా ఉన్నట్లు ఆయన తెలిపారు. రుణమాఫీపై 60 శాతం మంది, విద్యుత్తు సరఫరాపై 85 శాతం మంది సంతృప్తిగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

కాగా, సంక్రాంతి పండుగను పూర్తిగా సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. పండుగ సందర్భంగా ‘చంద్రన్న సంక్రాంతి' పేరుతో రాష్ట్రంలోని కోటీ ముప్పై లక్షల పేద కుటుంబాలకు ఆరు రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందన్నారు.
మహిళా ఆర్థిక స్వావలంబన, మాతాశిశు మరణాల తగ్గింపు, పౌష్టికాహారాన్ని అందించాలనే లక్ష్యంతో మహిళా సాధికార సంస్థను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. డ్వాక్రా, సెర్ఫ్, మెప్మా సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి వివిధ ప్రభుత్వ పథకాలను వీటి ద్వారానే చేపట్టాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లు పల్లె చెప్పారు.












Click it and Unblock the Notifications