పండుగని ఇంట్లో వాళ్లు గుడికి వెళితే...వికలాంగురాలిపై అత్యాచారం:అక్రమ సంబంధానికి మరో భర్త బలి
చిత్తూరు:జిల్లాలోని చౌడేపల్లె మండలంలో వినాయకచవితి పండుగ సందర్భంగా కుటుంబసభ్యులు అందరూ గుడికి వెళ్లగా...ఇంట్లో ఒంటరిగా ఉన్న వికలాంగురాలిపై అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిందితుడి బెదిరింపులకు భయపడి బాధితురాలి కుటుంబం పోలీసులకు తెలపడంలో జాప్యం చేయడంతో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుమార్తెపై జరిగిన అఘాయిత్యం గురించి తెలుసుకొని తల్లడిల్లిన తల్లిదండ్రులు తదనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు నెల్లూరు జిల్లా కావలి మండలం అన్నగారిపాలెంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో మరో భర్త దారుణ హత్యకు గురయ్యాడు.
పోలీసుల కథనం ప్రకారం...చిత్తూరు జిల్లా యల్లకుంట్ల పంచాయతీకి చెందిన ఒక కుటుంబం వినాయక చవితి పండుగ సందర్భంగా గుడికి వెళ్లారు. దీంతో వికలాంగురాలైన 18 ఏళ్ల యువతి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికుడైన 40 ఏళ్ల వ్యక్తి యువతి అంగవైకల్యాన్ని అవకాశంగా తీసుకొని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఈ నెల 13న తేదీన చోటుచేసుకుంది.

గుడికి వెళ్లిన యువతి కుటుంబీకులు తిరిగొచ్చాక ఆ యువతి జరిగిన విషయం చెప్పింది. బాధిత కుటుంబీకులు ఈ విషయాన్ని గ్రామ పెద్దలకు తెలుపగా వారు తాము మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పినట్లు తెలిసింది. ఆ క్రమంలో పెద్ద మనుషులు విచారించగా అత్యాచారం జరిగిన విషయం నిజమేనని తేలడంతో పాటు అతడు పెద్ద మనుషుల హెచ్చరికలను లక్ష్యపెట్టకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరోవైపు నెల్లూరు జిల్లా కావలి మండలం అన్నగారిపాలెంకు చెందిన జెడ్డా సురేష్(40) అనే వ్యక్తి వివాహేతర సంబంధం నేపథ్యంలో దారుణం హత్యకు గురయ్యాడు. సురేష్ మృతదేహాన్ని శనివారం రాత్రి మన్నంగిదిన్నె గ్రామం అటవీప్రాంతంలో పోలీసులు గుర్తించారు. సురేష్ కనిపించడం లేదని కావలి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఉదయం ఫిర్యాదు నమోదు కాగా దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన గోళ్ల వెంకట నరసయ్యపై అనుమానంతో విచారించారు.
ఈ విచారణలో ఈనెల 18వతేది సురేష్‌ను వెంకట నరసయ్య హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. హతుడు సురేష్ భార్యకు వెంకటనరసయ్యతో వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో ఇతడి అడ్డు తొలగించుకునేందుకే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. తాను హత్య చేసి పడవేసిన సురేష్ మృతదేహాన్ని వెంకటనరసయ్య శనివారం రాత్రి మన్నంగిదిన్నె నుంచి అన్నగారిపాలెం వెళ్లే అటవీప్రాంతంలో పోలీసులకు చూపించాడు. రూరల్ ఎస్‌ఐ పుల్లారావు, ఏఎస్‌ఐ డేవిడ్‌దాసు మృతదేహాన్ని కావలి ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications