ఏపీ మంత్రిపై హైకోర్టులో పిల్ వేసిన టీడీపీ నాయకుడు: కౌంటర్‌కు రెండు వారాల గడువు
అమరావతి: ఏపీ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జా ఆరోపణలు చేశారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం సమీపంలో 100 ఎకరాల చెరువును మంత్రి, ఆమె అనుచరులు ఆక్రమించుకుంటున్నారంటూ విమర్శలు సంధించారు. దీన్ని అడ్డుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కల్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఈ పిల్ వేశారని తెలుస్తోంది.
మంత్రి ఉషశ్రీ చరణ్, ఆమె అనుచరుల పేర్లను ఈ పిల్‌లో పొందుపరిచినట్లు చెబుతున్నారు. కల్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని సర్వే నంబర్ 329లో వంద ఎకరాల విస్తీర్ణంలో ఉండే సుబేదార్ చెరువును మంత్రి, ఆమె అనుచరులు ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. లారీలు, టిప్పర్లతో మట్టిని తరలించి..చెరువును పూడ్చి వేస్తోన్నారని విమర్శించారు. ఆ స్థలాన్ని ప్లాట్లు, వెంచర్లుగా మార్చి
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.

పిటీషనర్ ఉమామహేశ్వర నాయుడు తరఫున ప్రముఖ న్యాయవాది బాలాజీ ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. పిల్‌లో పొందుపరిచిన విషయాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. మంత్రి కావడం వల్ల పట్టించుకోవట్లేదని పేర్కొన్నారు. ఈ పిల్‌ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications