జగన్ పై మరో సీబీఐ, ఈడీ విచారణ..! హైకోర్టులో ఢిల్లీ లాయర్ పిల్..!
ఏపీలో విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓవైపు వరుస పర్యటనలతో బిజీ బిజీగా కనిపిస్తుంటే.. మరోవైపు కూటమి ప్రభుత్వం ఆయన్ను మద్యం స్కాంలో అరెస్టు చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇలాంటి సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై కూటమి ప్రభుత్వం గతేడాది విడుదల చేసిన శ్వేతపత్రాల ఆధారంగా జగన్ పై సీబీఐ, ఈడీ, ఐటీ దర్యాప్తు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది.
గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఈ శ్వేతపత్రాల్లో వివిధ రంగాల్లో వైసీపీ ప్రభుత్వం అవినీతి ఎలా చేసిందో కూటమి ప్రభుత్వం గణాంకాంలతో సహా వివరించింది. అయితే దీనిపై ఎలాంటి చర్యలు మాత్రం తీసుకోలేదు. కేవలం మద్యం స్కాంలో మాత్రం దర్యాప్తు చురుగ్గా జరుగుతోంది. మిగతా అంశాల్లో దూకుడుగా వెళ్లేందుకు కూటమి సర్కార్ ఇష్టపడటం లేదు.

ఈ నేపథ్యంలో ఢిల్లీకి చెందిన మెహెక్ మహేశ్వరి అనే ఓ లాయర్ కేంద్ర ప్రభుత్వ సంస్దలైన సీబీఐ, ఈడీ, ఐటీతో వైసీపీ హయాం
నాటి అవినీతిపై శ్వేతపత్రాల ఆధారంగా దర్యాప్తు చేయించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేసారు. ఆయా సంస్దలతో కలిపి ఓ సిట్ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఈ దర్యాప్తు జరిగేలా చూడాలని ఈ పిల్ లో లాయర్ మెహెక్ హైకోర్టును కోరారు. దీనిపై ఆగస్టు 6న హైకోర్టు విచారణ జరపబోతోంది.

దర్యాప్తు పారదర్శకంగా సాగేందుకు, అధికార దుర్వినియోగం కాకుండా చూడాలంటే జగన్ పై సిట్ దర్యాప్తు ఈ విధంగా కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని లాయర్ మెహెక్ హైకోర్టును కోరారు. అలాగే ఈ దర్యాప్తులో జగన్, అతని అనుయాయులు ఏ విధంగా అక్రమాలతో భారీగా అస్తులు పోగుచేసుకున్నారనే దానిపై నిష్పాక్షికంగా దర్యాప్తు జరిగేలా చూడాలని హైకోర్టును పిటిషనర్ కోరారు. దీనిపై హైకోర్టు సీజే ధీరజ్ సింగ్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం వచ్చేవారం విచారణ జరపనుంది.












Click it and Unblock the Notifications