నేనెప్పుడూ ఫ్యాక్షన్ రాజకీయాలు చెయ్యలేదు.. శవరాజకీయాలు చంద్రబాబువే: పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి
పల్నాడు జిల్లాలో టిడిపి కార్యకర్త జల్లయ్య హత్య ఘటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విరుచుకు పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. తానెప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు చేయలేదని కక్షలతో రగులుతున్న వారి మధ్య రాజీ కుదిర్చి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తున్నానని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.

చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నాడు: పిన్నెల్లి
రాష్ట్రంలో అధోగతి పాలైన తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం కోసం ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపిస్తూ చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో ప్రజలు టిడిపిని ఓడించారు అన్న కక్షతో చంద్రబాబు అల్లర్లు సృష్టించే వారిని చేరదీసి మద్దతు పలుకుతున్నారని, హత్యలు చేసే వారిని ప్రోత్సహిస్తున్నారని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు.

జూలకంటి బ్రహ్మారెడ్డి వల్లే పల్నాడులో దాడులు, హత్యలు
తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు గ్రామాలలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు కావాలని పల్నాడు ప్రాంతంలో కులాల మధ్య, మతాల మధ్య విభేదాలను సృష్టిస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విద్వేషాలకు చంద్రబాబే కారణం అని మండిపడ్డారు. ఇక అనేక సంవత్సరాలుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న జూలకంటి బ్రహ్మారెడ్డిని తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా నియమించిన అప్పటి నుంచే గ్రామాలలో గొడవలు జరుగుతున్నాయంటూ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఆరోపించారు.

టీడీపీ పాలనలోనే పల్నాడులో ఫ్యాక్షనిజం
తెలుగుదేశం పార్టీ హయాంలోనే పల్నాడులో అనేక గ్రామాలలో ఫ్యాక్షనిజం పెరిగిందని ఆయన మండిపడ్డారు. వైయస్ ఆర్ హయాంలో పల్నాడులో అభివృద్ధి పనులు జరిగాయని, ఫ్యాక్షన్ రాజకీయాలు ఆగిపోయాయని పేర్కొన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరిగి అరాచకాలు పెరిగాయని తెలుగుదేశం పార్టీకి చెందిన జల్లయ్య వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గుడిపాటి వెంకట రామయ్య ను హత్య చేశారని, అయినా ఫ్యాక్షన్ రాజకీయాలను వద్దని నచ్చజెప్పి తాను రాజీనామా చేశానని పేర్కొన్నారు.

వ్యక్తిగత కక్షలకు రాజకీయాలకు ముడి పెట్టి ఓట్ల కోసం బాబు నీచ రాజకీయం
ఇక రెండు కుటుంబాల మధ్య ఉన్న గొడవలను రాజకీయాలకు ముడి పెట్టి చంద్రబాబు ఓట్ల కోసం నీచంగా దిగాజారుతున్నారని మండిపడ్డారు. ఏడుగురిని హత్య కేసులో నిందితులైన జూలకంటి బ్రహ్మారెడ్డిని టీడీపీ ఇంచార్జ్ గా నియమించినప్పటినుండే పల్నాడులో ఇటువంటి పరిస్థితులు వచ్చాయని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రక్తపాతం సృష్టించి రెచ్చగొడుతున్నారని ఓట్ల కోసం కుటిల రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఘర్షణలకు దూరంగా పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని ప్రజలకు విజ్ఞప్తి చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చంద్రబాబు చేస్తున్న శవ రాజకీయాలను ప్రజలు నమ్మొద్దు అంటూ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications