రైతుల ఖాతాల్లో నిధుల జమ - తేదీ ఖరారు, తాజా సూచనలు..!!
PM Kisan: రైతుల ఖాతాల్లో మరోసారి నిధులు జమ కానున్నాయి. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా అమ లు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం 19వ విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో నిధుల జమకు నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో పథకం లబ్ది దారులకు కొత్త మార్గదర్శకాలు ఖరారు చేసారు. ఈ -కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేస్తున్నారు. చేయని వారి విషయంలో నిధులు జమ కావని అధికారులు తేల్చి చెబుతున్నారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మలి విడత నిధుల జమ ముహూర్తం ఖరారు చేసారు. ఇప్పటి వరకు 18 విడతల్లో ఈ పథకం కింద నిధులు జమ అయ్యాయి. మొత్తంగా రూ 3.46 లక్షల కోట్ల నిధులను రైతులకు అందించారు. దేశ వ్యాప్తంగా 13 కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. ఇక, 19వ విడత నిధులను ఈ నెల 24న విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సారి పథకం లబ్దిదారులు ఖచ్చితంగా ఈ -కేవైసీ పూర్తి చేస్తేనే నిధులు జమ అవుతాయని స్పష్టం చేస్తున్నారు. అలాగే భూ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయని రైతులు కూడా ఈ విడతలో సహాయం అందే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు.

లబ్దిదారులు తమ ఖాతాల్లో డీబీటీ విధానం ఆన్ చేసుకోవాలి. ఈ స్కీం కింద ప్రతీ ఏడాది అర్హత ఉన్న ప్రతీ రైతుకు కేంద్రం నుంచి రూ 6 వేలు ఆర్దిక సాయం అందుతోంది. ఏడాదిలో మూడు విడతలుగా ఈ సాయం అందిస్తున్నారు. ప్రతీ విడతలో రూ 2 వేలు చొప్పున అందేలా అమలు చేస్తున్నారు. ప్రతీ నాలుగు నెలలకోసారి రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. ఇక, ఈ కేవైసీ కోసం pmkisan.gov.in అధికారిక వెబ్ సైట్ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. హోమ్ పేజీలో ఈ కేవైసీ ఆప్షన్ లో భాగంగా తొలుత 12 అంకెల ఆధార్ నంబరు నమోదు చేసి మొబైల్ కు వచ్చే ఓటీపీ ద్వారా ప్రాసెస్ చేయాలని సూచించారు. పూర్తి చేసిన వారికి ఈ నెల 24న బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.












Click it and Unblock the Notifications