ప్రధాని నరేంద్ర మోడీకి తెలుగు ప్రజలంటే గౌరవం.. మర్యాద..!!!
ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మొదటి నుంచి తెలుగు ప్రజలంటే మహా ప్రేమ. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఉమ్మడి ఏపీకి చెందిన తెలుగు ప్రజలను చూసి నేర్చుకోవాలంటూ తరుచుగా తన ప్రసంగాల్లో చెబుతుండేవారు. కాలక్రమేణా ఆయన ప్రధానమంత్రి అయ్యారు.. అంతకుముందే ఉమ్మడి ఏపీ కూడా ఏపీ, తెలంగాణగా చీలిపోయింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

రాజకీయాలకు అతీతమైనదన్న జగన్
పార్టీలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వానికి అవసరమైనప్పుడల్లా వైసీపీ ఎంపీలు మద్దతిస్తూనే వచ్చారు. అందుకు తగ్గట్లుగా ముఖ్యమంత్రి జగన్ కూడా రాజకీయాలకు అతీతమైనది తమ ఇద్దరి బంధమని ఉద్ఘాటించారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని పథకాలు అమలు చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ కూడా జరిగింది. పలు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఇక్కడి పథకాల నుంచి స్ఫూర్తి పొందే ప్రారంభించాయి. కనీసం విశాఖ సభలో ఒక్క పథకం గురించి కూడా మోడీ పల్లెత్తి మాట్లాడకపోవడం వైసీపీ శ్రేణులను తీవ్రంగా నిరాశపరిచింది.

ప్రశంసాపూర్వకమైనవి రెండు మాటలు చాలు..
మోడీ సభ విజయవంతమవడానికి ప్రభుత్వ కృషి ఎనలేనిది. బీజేపీ బలం చూస్తే ఆ సభను నిర్వహించడం దానివల్ల అవదని చెప్పవచ్చు. పథకాల గురించి మాట్లాడకపోయినా కనీసం కొనియాడుతూ ఒకటి, రెండు మాటలు మాట్లాడినా ఏపీ ప్రభుత్వానికి ప్రోత్సాహంగా ఉండేది. బీజేపీకి బలం లేని రాష్ట్రంలో కూడా భారీ బహిరంగసభను ఏర్పాటు చేయించుకోవడమే కాకుండా తమ ముఖ్యమంత్రి గురించికానీ, ఇతర నేతల గురించి కానీ ప్రశంసాపూర్వకంగా రెండు మాటలు మాట్లాడినా చాలని వైసీపీ శ్రేణులు భావించాయి.

తమ పరిపాలన గురించే మాట్లాడిన మోడీ
కానీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన ప్రసంగం మొత్తం కేంద్రంలో పాలన.. తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అందుకు నాయకుల కష్టం గురించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుందని చెప్పినప్పుడు అందులో ఏపీ కూడా ఉంటుంది. ఏపీ అభివృద్ధి గురించి కూడా నాలుగు మాటలు మాట్లాడితే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభలకు ధీటుగా మోడీ సభ జరిగింది. అందుకు వైసీపీ ఎంతో తోడ్పడింది. ఒక చిన్న పొగడ్త కూడా ఒక మనిషిని పూర్తిగా ప్రేరేపిస్తుంది. కానీ ప్రధాన మంత్రి నుంచి అటువంటి పొగడ్త లేకపోయేసరికి వైసీపీ నాయకులు తీవ్రంగా నిరాశ చెందారు.












Click it and Unblock the Notifications