వెంకయ్య చొరవ: ఏడు మండలాల ఉద్యోగులకు ఆప్షన్లు
హైదరాబాద్: కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చొరవతో.. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అయిన పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురయ్యే ఏడు మండలాల్లోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆప్షన్స్ ఇచ్చేందుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో క్షేత్రస్థాయి ఉద్యోగులంతా ఎక్కడి వారు అక్కడే పని చేయాలని, రాష్ట్రస్థాయి, అఖిల భారతీయ స్థాయి ఉద్యోగులనే పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ అంశంపై పీఆర్టీయు ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఎన్ కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పూల రవీందర్‌ల ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఢిల్లీ వెళ్లారు. రాష్ట్ర విభజనలో అన్ని జిల్లాలూ ఏదో ఒక రాష్ట్రానికి వెళ్లాయని, ఒక్క ఖమ్మం జిల్లా పరిస్థితి మాత్రమే వేరుగా ఉందని, కాబట్టి ఏ రాష్ట్రంలో ఉండాలో ఎంచుకునే అవకాశం ఉద్యోగులకు ఇవ్వాలని కోరారు.

ఈ మేరకు గురువారం ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహాయంతో వారు వెంకయ్యతో భేటీ అయ్యారు. ఇప్పటి వరకూ తెలంగాణలో పని చేసిన 7 ముంపు మండలాల ఉద్యోగులు ఆంధ్రాకు బదిలీ కావాల్సి ఉంటుందని, అయితే ఈ ఉద్యోగులకు సంబంధించిన ఆస్తులు, బంధువులు ఇతరత్రా వ్యవహారాలన్నీ ఖమ్మం జిల్లాతోనూ, తెలంగాణతోనూ ముడిపడి ఉన్నాయన్నారు.
అన్ని శాఖలకు చెందిన దాదాపు 4,500 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ మండలాల్లో ఉన్నారని, వీరిలో కనీసం 3 వేల మంది ఆప్షన్స్ కోరుకుంటున్నారన్నారు. ఇందుకు స్పందించిన వెంకయ్య, వెంటనే పీఎంవో వ్యవహారాల మంత్రి జితేంద్ర సింగ్‌ను పిలిపించి, ఉద్యోగుల సమస్యను ఆయనకు వివరించి, తగిన పరిష్కారం చూపాలన్నారు. అనంతరం ఉద్యోగులకు కూడా ఆప్షన్స్ ఇచ్చేలా సానుకూలంగా చర్యలు తీసుకుంటామని వెంకయ్య, జితేంద్ర తమకు హామీ ఇచ్చినట్లు పీఆర్టీయు నేతలు చెప్పారు.












Click it and Unblock the Notifications