హుస్సేన్ సాగర్‌లో తేలిన పోలీసు కానిస్టేబుల్ భార్య శవం
హైదరాబాద్: హైదరాబాదులోని హుస్సేన్ సాగర్‌లో ఓ కానిస్టేబుల్ భార్య శవం బయటపడింది. గురువారం ఈ సంఘటన వెలుగు చూసింది. భర్తనే చంపి, హుస్సేన్ సాగర్‌లో పడేశాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతురాలిని 30 ఏళ్ల రాధగా గుర్తించారు.
వివరాలు ఇలా ఉన్నాయి - ఇసిఐఎల్ ఉద్యోగి కూతురు ఎస్ రాధ డిసెంబర్ 6వ తేదీ నుంచి కనిపించడం లేదు. సికింద్రాబాదులోని తార్నాకాలో గల అత్తగారి ఇంటి నుంచి ఆమె మాయమైంది. ఆమె భర్త వెంకటరమణ (34) ఫస్ట్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడని, ఏడాది కాలంగా అతను అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్నాడని రాధ కుటుంబ సభ్యులు అంటున్నారు.

వరకట్నం వేధింపుల కింద ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీసులు వెంకట్‌పై కేసు నమోదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రూ.4 లక్షల కట్నం తేవాలని వెంకట్ భార్యను వేధిస్తూ వచ్చాడని ఆరోపణలు వచ్చినట్లు ఎసిపి లక్ష్మినారాయణ చెప్పారు.
ఇంటి నుంచి కనిపించకుండా పోయిన తర్వాత తమకు ఫిర్యాదు చేశారని, మిస్సింగ్ కింద కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. రాధ సిసిఎస్ మహిళా పిఎస్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. పోలీసులు భార్యాభర్తలను కౌన్సెలింగ్ కోసం కూడా పిలిచారు. అయితే, వెంకట్ కౌన్సెలింగ్కు హాజరు కాలేదు. వెంకట్ తన కూతురిని కొట్టాడని, తమ ఇంటికి పంపించాడని రాధ తండ్రి ఎస్ నాగేశ్వర రావు ఆరోపించారు. డిసెంబర్ 6వ తేదీన తాను ఫోన్ చేస్తే రాధ ఇంట్లో లేదని చెప్పారని, చంపేశారనే అనుమానాలున్నాయని ఆయన అన్నారు. వెంకట్, రాధలకు ఇద్దరు పిల్లలున్నారు.












Click it and Unblock the Notifications