భలే కిలాడీలు:భారీ గోల్డ్ చైన్ అని...కుక్కగొలుసు చేతిలో పెట్టారు
పశ్చిమగోదావరి:ఆకివీడు బంగారం పేరుతో మోసాలకు దిగే నేరగాళ్ల ఆవాసం...మెత్తటి తీయటి మాటలతో మెల్లిగా రంగంలోకి మొత్తంగా దోచుకుపోవడం అక్కడి మాయగాళ్లకి వెన్నతో పెట్టిన విద్య.
ఇక్కడి నేరగాళ్ల టాలెంట్ గురించి తెలియని ఓ ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగులు అచ్చం ఇలాగే నిలువునా మోసపోయి లబోదిబోమన్నారు. ఆ తరువాత షరా మామూలుగానే పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు మాత్రం షరామామూలుగానే లైట్ గా తీసుకోకుండా వెంటనే రంగంలోకి దిగి సీరియస్ గా దర్యాప్తు జరిపారు. కేసు తీరును బట్టి ఇది ఆకివీడు కేడీగాళ్ల పనేనని నిర్ధారించుకొని ఆ దిశలో విచారణ చేసి నేరస్థులను దోపిడీ సొత్తుతో సహా పట్టేశారు. వివరాల్లోకి వెళితే...

ఆకివీడుకు చెందిన మేకల నాగేంద్ర, తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన బండి ఈశ్వరరావు తమ వద్ద భారీ మొత్తంలో బంగారం ఉందని, దాన్నితాకట్టు పెట్టి నగదు తీసుకుంటామని తాడేపల్లిగూడెంలోని కొసమట్టం ఫైనాన్స్ కంపెనీని సంప్రదించారు. తమ వద్ద ఉన్నది బాగా బరువుండే అరుదైన బంగారు ఆభరణం అని చెప్పారు. దానికి బైట మార్కెట్ లో చాలా విలువ ఉంటుందని, తమకు నాలుగోవంతు డబ్బు ఇచ్చినా చాలని మాయమాటలు చెప్పారు. వీరి మాటలు నమ్మిన కొసమట్టం ఫైనాన్స్ కంపెనీ సంస్థ ప్రతినిధులతో ఆ నగకోసం మార్చి ఒకటిన తమను ప్రత్తిపాడు వద్ద కనకదుర్గమ్మ గుడి వద్ద కలుసుకోమని చెప్పారు.
వీరు చెప్పిన ప్రకారం ఆ సంస్థ ప్రతినిథులు ఆ గుడి వద్దకు వెళ్లగా నాగేంద్ర, ఈశ్వరరావులు వీరిని కలసి పెద్ద చేతురుమాలులో ఉన్న ఒక భారీ బంగారు ఆభరణాన్ని చూపించారు. సంస్థ ప్రతినిధులు అక్కడికక్కడే చెక్ చేసి చూడగా అది బంగారందే అని తేలింది. దీంతో సంస్థ ప్రతినిధుల నుండి రూ.3.50 లక్షల నగదును తీసుకున్నారు. ఆ తరువాత వారికి చేతురుమాలులో సహా బంగారు ఆభరణాన్నివారికి ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే వారిద్దరు అక్కడ నుంచి వెళ్లిపోయిన తరువాత సంస్థ ప్రతినిధులు మరోసారి ఆ బంగారు ఆభరణాన్ని చూసేందుకు కర్ఛీఫ్ తెరవగా అందులో కుక్క గొలుసు ఉండటం చూసి ఖంగుతిన్నారు.
దీంతో ఆ మాయగాళ్లు ముందు బంగారు ఆభరణాన్ని చూపించి, ఆ తరువాత మాటల్లో పెట్టి తిరిగిచ్చేప్పుడు కుక్కకి వేసే గొలుసును ఆ చేతిరుమాలులో పెట్టి ఇచ్చి వెళ్లిపోయారని గుర్తించారు. దీంతో లబోదిబోమంటూ సంస్థ వారికి జరిగిన విషయాన్ని తెలియచేయగా కంపెనీ మేనేజర్ జువ్వలపల్లి సుధాకర్ స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తదనంతరం సీఐ రాజశేఖర్ సూచనలతో దర్యాప్తు చేసిన ఎస్సై ఎ.రమేష్ పెంటపాడు గేటు కూడలిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్ననాగేంద్ర, ఈశ్వరరావులను అరెస్టు చేసి వారి నుంచి రూ.3.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications