అనూహ్య కేసు: ఇంకా మిస్టరీగానే, ఫోన్ కాల్స్ ఎన్ని?
ముంబై/విజయవాడ: మహారాష్ట్రలోని ముంబైలో దారుణ హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంకు చెందిన మహిళా సాఫ్టువేర్ ఇంజనీర్ అనూహ్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు. అనూహ్య కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)కి అప్పగించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిందితులను గుర్తించి అరెస్టు చేయాలని సంఘటన జరిగిన నాటి నుండి నేటి వరకు జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
అఖిల పక్ష నాయకులు అనూహ్య కుటుంబానికి అండగా నిలిచారు. ప్రతిరోజూ ఏదో ఒక ఆందోళన కార్యక్రమాన్ని జిల్లా కేంద్రం మచిలీపట్నంలో నిర్వహిస్తున్నారు. అలాగే జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సైతం పలువురు శాంతి ర్యాలీ నిర్వహించి కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. కేసులో మిస్టరీ వీడటం లేదు.

ముంబై పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అనూహ్య హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతూ ముంబై పోలీసుల ముందు పెద్ద సవాల్‌గా నిలిచింది. పక్కా ప్రణాళికతో అనూహ్య హత్య జరగటంతో ఆధారాలు సేకరించడం కష్ట సాధ్యమవుతోంది. పలువిడతలు ముంబై పోలీసులు హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం వచ్చినప్పటికీ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నా సమాచారం రాలేదు.
తన కుమార్తె హత్య కేసులో ముంబై పోలీసులు వ్యవహరిస్తున్న తీరును అనూహ్య తండ్రి ప్రసాద్ ఎండగట్టారు. సమాజంలో ఏ ఆడపిల్లకూ ఇలాంటి అన్యాయం జరగకూడదనే ఉద్దేశ్యంతో తాను మనోధైర్యంతో పోరాడుతున్నానన్నారు. తన కూతురిని పొట్టన పెట్టుకున్న హంతకులను నడి రోడ్డుపై ఉరితీయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
దళిత జాయింట్ యాక్షన్ కమిటీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం బందరు బంద్ నిర్వహించనున్నారు. ముంబై పోలీసుల తీరును నిరసిస్తూ నిర్వహించే ఈ బంద్‌ను అన్నివర్గాల ప్రజలు జయప్రదం చేయాలని దళిత జెఎసి కన్వీనర్ ఒక ప్రకటనలో కోరారు.
కాగా, స్టేషన్ నుంచి ఫోన్‌లో మాట్లాడుతూ బయటకు వస్తున్న అనూహ్య ఎవరితో మాట్లాడుతుందో నిర్ధారించలేక పోతున్నారు. ఆ ఫోన్లు వాటిలో మాటలు బయటకు వస్తే కొంత మిస్టరీ వీడే అవకాశముంది. పోలీసులు ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నారు.
అనూహ్య ఫోన్ మాట్లాడే సమయంలో ఆ ప్రాంతం నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ బయటకు వెళ్ళాయి, బయట నుంచి ఎన్ని కాల్స్ వచ్చాయనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు 500 నుంచి 600 ఫోన్ కాల్స్‌ను పోలీసులు గుర్తించినట్టు సమాచారం. వాటన్నింటిని పోలీసులు వడపోస్తున్నారు. అనూహ్య హత్య కేసును ముంబైలో మూడు పోలీసు బృందాలు, కృష్ణా, హైదరాబాదులో ఒక్కో బృందం విచారిస్తోంది.












Click it and Unblock the Notifications