జగన్ మాజీ మంత్రులకు బిగిస్తున్న ఉచ్చు - లిస్టులో ఫస్ట్..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలే లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణల పైన విచారణ మొదలు పెట్టింది. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక, భూ దందాలు చేసారనే ఆరోపణల్లో జగన్ కేబినెట్ లో పని చేసిన ఆరుగురు మంత్రులకు ఉచ్చు బిగిస్తోంది. వీరి పైన చర్యలు తీసుకోవాలంటూ రెవిన్యూ అధికారులు సీఎం కు నివేదిక ఇచ్చారు.
కాకాణికి నోటీసులతో
వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో మాజీ మంత్రుల పైన కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. క్వార్ట్జ్ అక్రమాలు, భారీ పేలుడు పదార్ధాల వినియోగం, రవాణా కేసులో నోటీసులు ఇచ్చారు. అక్రమ మైనింగ్ కేసులో విచారణ నిమిత్తం నోటీసులు ఇవ్వడానికి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కాగా, కాకాణి, ఆయన పీఏకు ఫోన్లు చేస్తే స్విచ్ఛాఫ్ వస్తున్నాయని చెప్పారు. ఇక, ఈ రోజు (సోమవారం) 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసులో కాకాణి గోవర్ధన్‌రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇంటికి నోటీసులు అంటించటంతో కాకాణి హాజరు పైన సస్పెన్స్ కొనసాగుతోంది.

భూ దందాలపై ఫిర్యాదులు
ఇక, వైసీపీ హయాంలో భూ దందాలకు పాల్పడ్డారంటూ ఆరుగురు మాజీ మంత్రుల పై రెవిన్యూ శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 13.59 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్ చేయగా.. అందులో 5.74 లక్షల ఎకరాలను అక్రమంగా, చట్టవ్యతిరేకంగా, జీవో 596ని ఉల్లంఘించి నిషేధ జాబితా నుంచి బయటకు తీసినట్లు రెవిన్యూ అధికారులు విచారణలో తేల్చారు. అందులో 25 వేల ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయగా, అందులో 8,483 ఎకరాల విషయంలో అక్రమాలు జరిగాయని తేల్చినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో వైసీపీ హయాంలో పని చేసిన ఆరుగురు మంత్రులు, 42 మంది ప్రజాప్రతినిధులు, 120 మంది నేతలు, 22 మంది డిప్యూటీ కలెక్టర్లు, 48 మంది తహశీల్దార్లు, 23 మంది మండల సర్వేయర్లు.. ఈ భూదందాల్లో ప్రధాన పాత్రధారులని రెవెన్యూ శాఖ తన నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.
సీఎం చేతిలో నిర్ణయం
నేతలు, అధికారులపై అసైన్డ్ భూముల చట్టం-1977లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని సిఫారసు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఈ దందాలో పాత్రధారులుగా భావిస్తున్న ఆర్‌డీవోలు, తహశీల్దార్లుగా పనిచేసిన రెవెన్యూ అధికారులపై శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ సిఫార్సులకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో, ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు పరిశీలనకు పంపించారు. కీలకైన ఈ సిఫార్సుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకొనే నిర్ణయం ఆధారంగా వారి పైన కేసులు.. విచారణ అంశం పైన స్పష్టత రానుంది. రాజకీయంగానూ ఈ నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications