జగన్ నర్సీపట్నం రోడ్ షోకి నో పర్మిషన్, అలా వస్తే ఓకే - వైసీపీ ససేమిరా..!!
మాజీ సీఎం జగన్ జిల్లా పర్యటన వేళ మళ్లీ చర్చ మొదలైంది. ఈ నెల 9న జగన్ నర్సీపట్నం లో మెడికల్ కాలేజీ సందర్శనకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందు కోసం విశాఖ నుంచి మెడికల్ కాలేజీ ఉన్న మాకవరపాలెం వరకు రోడ్ షోకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పోలీసుల అనుమతి కోరారు. ఈ పర్యటన పైన జిల్లా ఎస్పీ తుహిన్ కుమార్ స్పందించారు. రోడ్ షోకు అనుమతి ఇవ్వలేమని.. హెలికాప్టర్ వెళ్లేందుకు అనుమతి కోరితే పరిశీలిస్తామని స్పష్టం చేసారు. వైసీపీ నేతలు మాత్రం పర్యటన జరిగి తీరుతుందని తేల్చి చెబుతున్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ మెడికల్ కాలేజీల పరిశీలనలో భాగంగా ఈ నెల 9న నర్సీపట్నం వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ విశాఖ నుంచి మాకవరపాలెం వరకు 63 కిలో మీటర్ల మేర రోడ్ షో నిర్వహణకు నిర్ణయించారు. ఈ మేర కు పోలీసు అధికారులను అనుమతి కోరారు. దీని పైన జిల్లా ఎస్పీ తుహిన్ కుమార్ స్పష్టత ఇచ్చారు. జాతీయ రహదారి రోడ్డు మార్గంలో కూడళ్ల వద్ద జన సమీకరణ చేసే ఆలోచనలు చేస్తు న్నట్లు సమాచారం అందిందన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా రోడ్డు మార్గంలో మాజీ సీఎం జగన్ పర్యటించేందుకు అనుమతులు నిరాకరిస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులో ఇటీవల విజయ్ నిర్వహించిన రోడ్ షోలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, వందమందికి పైగా గాయపడ్డారని గుర్తుచేశారు.

కరూర్ లో చోటుచేసుకున్నటు వంటి దురదృష్టకరమైన సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇందులో భాగంగానే మాజీ సీఎం జగన్ 63 కిలోమీటర్ల మేర కాన్వాయ్‌తో ప్రయాణించేందుకు అనుమతిని నిరాకరించామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా స్పష్టం చేశారు. మాకవరపాలెం మెడికల్ కళాశాల వద్ద హెలిపాడ్ ఏర్పాటు చేసి జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్‌లో వచ్చేందుకు ముందుకు వస్తే పరిశీలిస్తామని చెప్పారు. కాగా, వైసీపీ నేతలు మాత్రం గతంలో జగన్ జిల్లాల పర్యటన సమయంలోనూ ఇదే రకంగా ఆంక్షలు విధించినా ప్రజల నుంచి స్పందన వచ్చిందని చెప్పుకొచ్చారు. పోలీసులు అనుమతి నిరాకరించినా జగన్ నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ సందర్శకు వస్తారని తేల్చి చెబుతున్నారు. దీంతో.. మరోసారి జగన్ పర్యటన వేళ ఆంక్షలు.. రోడ్ షో నిర్వహణ అనేది ఉత్కంఠ పెంచుతోంది.












Click it and Unblock the Notifications