పుత్తూరు ఆపరేషన్ సక్సెస్: ఇద్దరు టెర్రరిస్టుల అరెస్టు
చిత్తూరు: జిల్లాలోని పుత్తూరులోని ఓ ఇంట్లో మాటువేసిన ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ ముగిసింది. పోలీసులు ఇద్దరు ఉగ్రవాదాలను అదుపులోకి తీసుకుని రహస్యంగా తరలించినట్లు తెలుస్తోంది. ఒకతన్ని గాయబపడడంతో పుత్తూరు ఆస్పత్రికి, మరొకతన్ని చెన్నైకి తరలించినట్లు సమాచారం. ఇంటిలో దాక్కున్న ఉగ్రవాదులు ఆల్ - ఉమాకు చెందినవారని సమాచారం.
ఉగ్రవాదులను అదుపులోకి తీసుకోవడానికి ముందు ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు లొంగిపోయారు. ఇంటికి కన్నం వేసి బ్లాక్ క్యాట్ కమెండోలు, ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ బలగాలు లోనికి గ్యాస్‌ను పంపించారు. ఈ క్రమంలో వారు లొంగిపోయారు. ఆ తర్వాత అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఇద్దరు ఉగ్రవాదులను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిద్దరిని బిలాల్, ఇస్మాయిల్‌గా గుర్తించారని అంటున్నారు.

చెన్నై ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసిన ఆల్ - ఉమ సంస్థకు చెందిన ఫక్రుద్దీన్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు పుత్తూరులో దాడులు నిర్వహించారు. శనివారం తెల్లవారు జామున ఆపరేషన్ ప్రారంభమైంది. ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన సిఐ లక్ష్మణ్ ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
చిత్తూరు జిల్లా ఎస్పీ కాంతిరాణా, తమిళనాడు ఎస్ఐబి ఎస్పీ, తిరువళ్లూరు ఎస్పీలు పరిస్థితిని సమీక్షించారు. వివరాలు తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిజిపి ప్రసాదరావు వెంటనే పుత్తూరుకు ఆక్టోపస్ బలగాలను పంపించారు.
ఫక్రుద్దీన్‌తో పాటు పుత్తూరు ఇంట్లో తలదాచుకున్న ఇద్దరు ఉగ్రవాదులు తమిళనాడు బిజెపి నేత రమేష్‌ను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. అలాగే, 2011లో బిజెపి అగ్రనేత అద్వానీని హతమార్చేందుకు కుట్ర చేశారని భావిస్తున్నారు. అద్వానీ మధురై పర్యటన సందర్బంగా అల్ - ఉమ తీవ్రవాదులు బాంబు పేల్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కోయంబత్తూర్ వరుసల పేలుళ్లలో కూడా ఈ సంస్థ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications