అనురాధ దంపతుల హత్య: చింటూ ఆఫీసులో విషపూరితమైన కత్తులు
చిత్తూరు: చిత్తూరు మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న చంద్రశేఖర్ అలియాస్ చింటూ కార్యాలయంలోనూ ఇంటిలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు మారణాయుధాలు లభ్యమయ్యాయి.
రెండు విషపూరితమైన చిన్న కత్తులు, ఓ పెద్ద కత్తి, గూర్ఖాలు వాడే మరో కత్తి చింటూ కార్యాలయంలో దొరికాయి. చిత్తూరు మేయర్ అనూరాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో వారి మేనల్లుడైన చింటూయే ప్రధాన నిందితుడని భావిస్తున్నారు. పోలీసులు శనివారం చిత్త్తూరులోని చింటూ ఆఫీసు, నివాసంలో ఆయన తల్లిదండ్రుల సమక్షంలో సోదాలు జరిపారు.
ఆఫీసులోని బీరువాలో కత్తులు, ఇనుపరాడ్లు, లాఠీల్లాంటి కొయ్యలు లభించాయి. ఇంట్లో వివిధ బ్యాంకుల పాసు పుస్తకాలు, ఫైళ్లు, డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెల రోజుల వ్యవధిలో చింటూ తండ్రి సుబ్రహ్మణ్యం నాయుడుకు చెందిన బ్యాంకు ఖాతాల నుంచి రూ.కోటికిపైగా చెల్లింపులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

మేయర్ దంపతుల హత్యకు నెల రోజుల ముందు నుంచి లక్షలాది రూపాయలు విత్‌డ్రా చేసి ఇతరులకు చెల్లించినట్లు తేల్చారు. ఇదే సమయంలో కర్ణాటక రాష్ట్రం ముళబాగిల్‌లోని వెంకటాచలపతి ఇంట్లో శనివారం చిత్తూరు పోలీసులు సోదాలు చేశారు.
సెల్స్ ఫోన్ కాల్స్ డేటా
చంద్రశేఖర్ అలియాస్ చింటూకు కంప్యూటర్ పరిజ్ఞానం, సెల్ ఫోన్లలో పలు యాప్స్‌పై పట్టు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. చింటూ కోసం పది బృందాలు గాలిస్తుండగా దుండగులు సాంకేతిక పరిజ్ఝానాన్ని ఏ స్థాయిలో వాడుకున్నారో తెలుసుకోవడానికి కమ్యూనికేషన్స్, సైబర్ క్రైమ్ నిపుణులైన పోలీసు అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.
చిత్తూరులోని గంగనపల్లి వద్ద ఉన్న తన కార్యాలయం వద్ద చింటూ నాలుగురు సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిని ఓ టీవీకి అనుసంధానం చేసి నిత్యం ఆ దారిలో ఏయే సమయాల్లో ఎవరెవరు వస్తున్నారో తెలుసుకుంటున్నట్లు దర్యాప్తులో తేలింది. అతడి కార్యాలయానికి వచ్చేవారి వివరాలు కూడా స్టోరేజ్ రికార్డర్ రైటర్‌లో నిక్షిప్తం చేసినట్లు పోలీసులు కనుకున్నారు. దాన్ని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.
అదే విధంగా చింటూ సెల్ నెంబర్‌కు మూడు నెలలుగా వచ్చిన ఇన్ కమింగ్ కాల్స్, ఔట్ గోయింగ్ కాల్స్ జాబితాను పోలీసులు తీసుకున్నారు. ఇందులోని ప్రతీ కాల్ డేటాను నిశితంగా పరిశీలిస్తున్నారు. చింటూకు సన్నిహితంగా కొంత మంది ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీళ్లకు హత్యతో ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తు్నారు.
గంగనపల్లికి చెందిన ఇద్దరిని, సంతపేటకు చెందిన ఓ వ్యక్తిని, ఎస్టేట్‌కు చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. సంతపేటకు చెందిన అధికార పార్టీ కార్పోరేటర్ భర్తను విచారణ చేయడానికి ప్రయత్నిస్తుండగా అతను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications