రేవంత్ పై చంద్రబాబు ప్రశంసలు - బీజేపీకి సంకేతాలు..!!
టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ పైన ఫోకస్ చేసారు. తెలంగాణలో పార్టీని పునర్నిర్మాణం చేస్తామని ప్రకటించారు. అదే సమయంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి పని తీరును ప్రశంసించారు. చంద్రబాబు ప్రస్తుతం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. బీజేపీతో పొత్తు కొనసాగిస్తూ కాంగ్రెస్ సీఎం ను ప్రశంసించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని పైన బీజేపీ ఆలోచన ఏంటనేది ఆసక్తిని పెంచుతోంది.
చంద్రబాబు వ్యాఖ్యలతో
తెలంగాణలో పార్టీని తిరిగి బలోపేతం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. తెలంగాణ లో పార్టీకి బలమైన కేడర్ ఉందని...లీడర్స్ మాత్రమే వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ.. పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసాయి. బీజేపీ ఎనిమిది సీట్లు గెలిచింది. ఒంటరిగా పోటీ చేసిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ 8 సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు తెలంగాణలో మరోసారి బలం చాటుకొనే దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది.

చంద్రబాబు కొత్త వ్యూహం
రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారం కోసం రేవంత్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాలు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని కేంద్రం సూచించింది. ఈ భేటీ ద్వారా సమస్యల పరిష్కారం పైన ఇద్దరు సీఎంలు ఒక అంచనాకు వచ్చారు. ఇదే సమయంలో రేవంత్ పాలనను చంద్రబాబు ప్రశంసించటం పైనే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కొద్ది రోజుల క్రితం పవన్ కల్యాణ్ సైతం తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందని ప్రకటించారు. ఆ సమయంలో టీడీపీ ప్రస్తావన చేయలేదు.
బీజేపీ లెక్క ఏంటి
ఇప్పుడు చంద్రబాబు తెలంగాణలో తమ పార్టీకి బలం ఉందని నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, ఏపీ తరహాలో తిరిగి మూడు పార్టీలు తెలంగాణలో త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో..స్థానిక సంస్థల్లో పోటీ చేస్తాయా అనే చర్చ తెర మీదకు వచ్చింది. తెలంగాణలో వచ్చ ఎన్నికల నాటికి ఎలాగైనా అధికారంలోకి రావాలనేది బీజేపీ లక్ష్యంగా ఉంది. ఇప్పుడు టీడీపీ సైతం తమ బలం పెంచుకొనే ప్రయత్నాలు ప్రారంభించింది. మరి..తెలంగాణలో చంద్రబాబు తాజా వ్యూహాలు..బీజేపీ స్పందన...భవిష్యత్ ప్రణాళికలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications