బెజవాడ వరదలో బురద రాజకీయం-రెస్క్యూ ఆపరేషన్ కు అడ్డంకిగా నేతల పరామర్శలు..!
వరదలు ముంచెత్తిన విజయవాడ నగరంలో భారీ ఎత్తున కొనసాగుతున్న సహాయక చర్యలకు రాజకీయ నేతలు తలనొప్పిగా మారారు. బాధితుల్ని పరామర్శించే పేరుతో వీరు చేస్తున్న పర్యటనలు వారికి అవసరమైన సాయం అందించకపోగా.. అప్పటికే అందుతున్న సాయానికి సైతం అడ్డంకిగా మారుతోంది. దీంతో బాధితులకు అందాల్సిన సాయం నానాటికీ ఆలస్యమవుతోంది. దీంతో బాధితులు రాజకీయ నేతల్ని తమ ప్రాంతాలకు రావొద్దని చెప్పేస్తున్నారు.
విజయవాడ నగరంలోని సింగ్ నగర్, కండ్రిక, నున్న, వాంబే కాలనీ ఇలా చాలా ప్రాంతాల్లో రెండు రోజులుగా ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అయినా ఇవే ప్రాంతాల్లో వేల సంఖ్యలో బాధితులు తమకు సాయం అందట్లేదని సోషల్ మీడియాలో మెసేజ్ లు, వీడియోలు పెడుతూనే ఉన్నారు. ఓవైపు ప్రభుత్వం భారీ ఎత్తున ఆహారం, మందుల్ని ఈ ప్రాంతాలకు పంపుతున్నా అవి వీరికి అందించడంలో వైఫల్యం వెంటాడుతోంది.

దీనికి అసలు కారణం గమనిస్తే రాజకీయ నేతలు పరామర్శల పేరుతో చేస్తున్న వరుస పర్యటనలే. వరద ప్రాంతాల్లో మంత్రులు, రాజకీయ నాయకుల పర్యటనలతో సహాయ చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇక్కడికి పరామర్శల కోసం వస్తున్న వీఐపీల ప్రోటోకాల్ కోసం పోలీసుల ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.వీఐపీలకు రూట్ క్లియర్ చేయడం, ట్రాఫిక్ క్లియర్ కోసం పోలీసులు ఎక్కువగా శ్రమించాల్సి వస్తోంది.
మరోవైపు ఉన్నత స్థాయి సమీక్షల్లో అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలకూ, క్షేత్ర స్థాయిలో ఉన్న సిబ్బందితో సమన్వయం కుదరడం లేదని తెలుస్తోంది. రాజకీయ పరామర్శలకి బ్రేక్ ఇస్తే సహాయ చర్యల్లో వేగం పుంజుకునే అవకాశం ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. ఇంకా పలు ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందికి కమ్యూనికేషన్ రేడియోలు అందకపోవడం, బ్యాటరీలు అయిపోవడంతో వంటి సమస్యలతో క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం అందడం లేదని తెలుస్తోంది. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో కేటాయించిన విధుల్లో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదన్న ఫిర్యాదులు కూడా వస్తున్నాయి.












Click it and Unblock the Notifications