వైసీపీలో ఆశా ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ? రంగాపై జగన్ ట్వీట్ తో..!
దివంగత కాపు నాయకుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా ఇవాళ ఆయనకు పలువురు నివాళులు అర్పిస్తున్నారు. ఇందులో ఆయన కుమారుడు వంగవీటి రాధ, కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ తో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు, అభిమానులు ఉన్నారు. వాడవాడలా ఉన్న రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి వీరు వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ రంగాను గుర్తుచేసుకుంటూ ఓ ట్వీట్ చేశారు.
"పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా గారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు." అంటూ వైఎస్ జగన్ ఇవాళ ట్వీట్ చేశారు. గతంలోనూ పలుమార్లు వైఎస్ జగన్ రంగాను గుర్తుచేసుకుంటూ ట్వీట్లు పెట్టినా ఈసారి ట్వీట్ కు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. అది వంగవీటి రంగా వారసుడిగా భావించిన రాధాకృష్ణ గతంలో పార్టీని వీడిన తర్వాత ఆయన స్ధానంలోకి వచ్చేందుకు సోదరి ఆశా కిరణ్ ప్రయత్నాలు చేస్తుండటమే.

గతంలో వంగవీటి రాధ వైఎస్సార్సీపీలో కొనసాగారు. అయితే 2019 ఎన్నికల సమయంలో విజయవాడ తూర్పు లేదా బందరు పార్లమెంట్ స్ధానంలో పోటీ చేయాలని జగన్ ఆయనకు ఆప్షన్స్ ఇచ్చారు. కానీ ఈ రెండింటినీ కాదని తనకు విజయవాడ సెంట్రల్ టికెట్ కావాలని పట్టుబట్టారు. దీంతో అప్పటికే ఆ టికెట్ ను సీనియర్ నేత మల్లాది విష్ణుకు ఖరారు చేసినట్లు జగన్ చెప్పేశారు. ఈ నేపథ్యంలో కొంతకాలం సైలెంట్ గా ఉన్న వంగవీటి రాధ.. ఆ తర్వాత వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆ పార్టీలోనూ పదవులు ఇస్తారని భావించినా ఆయనకు ఏదీ దక్కలేదు. ఈ సమయంలో ఆయన సోదరి ఆశా కిరణ్ ఎంట్రీ ఇచ్చారు.

పేద ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించి, వారి గొంతుకగా నిలిచిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన రంగా గారు. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/CPgKs65Lbt
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 26, 2025
తాజాగా వంగవీటి ఆశా కిరణ్ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అయితే ఏ పార్టీలో చేరబోనని బహిరంగంగానే చెప్తున్నప్పటికీ, తెరవెనుక మాత్రం వైఎస్సార్సీపీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె ఎంట్రీ విషయంలో జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇవాళ జగన్ రంగాపై చేసిన ట్వీట్ పై చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆశా కిరణ్ వైసీపీలోకి వస్తే జగన్ ఆమెకు ఏ పదవి ఇస్తారన్న దానిపైనా బెజవాడలో చర్చలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications