2024 ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చేదెవరో తేల్చేసిన లేటెస్ట్ సర్వే
అమరావతి: ఏపీ.. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశించింది. అసెంబ్లీ ఎన్నికలు ఎంతో దూరంలో లేవు. మరో నాలుగు నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఏప్రిల్/మే నాటికి పోలింగ్ ప్రక్రియ ముగిసిపోవచ్చు. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపొందించుకుంటోంది.
అటు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సమాయాత్తమౌతోంది. వైఎస్ఆర్సీపీని గద్దె దించడమే లక్ష్యంగా పొత్తు ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో జనసేన పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగబోతోంది. వైఎస్ఆర్సీపీ ఒకవంక- మిగిలిన ప్రతిపక్ష పార్టీలు మరోవంక.. వచ్చే సార్వత్రిక ఎన్నికల సమరంలో పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోన్నారు. అసెంబ్లీ స్థానాలన్నింటినీ క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలను మార్చివేస్తోన్నారు. జనాదరణ లేని ఎమ్మెల్యేలకు టికెట్లను ఇవ్వడానికి నిరాకరిస్తోన్నారు.
ఈ పరిస్థితుల మధ్య- తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్.. ఏపీ రాజకీయాలపై ఓ సర్వేను నిర్వహించింది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదెవరనేది తేల్చి చెప్పింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది?, ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్ఠిస్తారనేది స్పష్టం చేసింది.
ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం చూస్తే- మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి పడే ఓట్ల శాతం.. 49. 48.5 శాతం మేర ఓట్ల తేడాతో వైసీపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేసింది పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్.. వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొంది.
జనసేనతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్లినప్పటికీ.. పెద్దగా ఉపయోగం ఉండబోదని అభిప్రాయపడింది. ఈ రెండు పార్టీలకు కలిపి 46.5 శాతం ఓట్లు పడొచ్చని అంచనా వేసింది. విడివిడిగా చూసుకుంటే టీడీపీ- 38.2, జనసేన- 8.2 శాతం మేర ఓట్లు పోల్ అవుతాయని వివరించింది. ఇతరులకు 5.1 శాతం ఓట్లు పడతాయని తెలిపింది.
56 శాతం జగన్ పరిపాలనను మెచ్చుకుంటోన్నారు. ఆయన పాలన బాగుందంటూ ప్రశంసిస్తోన్నారు. జగన్ పాలన అద్భుతంగా ఉందని ప్రశంసించే వారి శాతం.. 9గా నమోదైంది. 22 శాతం మంది జగన్ పాలన బాగోలేదని తేల్చి చెబుతున్నట్లు పోల్ స్ట్రాటజీ గ్రూప్ తెలిపింది. జగన్ ప్రభుత్వం అధ్వాన్నంగా పని చేస్తోందంటూ ఎనిమిది శాతం మంది, ఎటూ చెప్పలేమంటూ మరో మూడు శాతం మంది అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications