కెసిఆర్‌తో రాలేదు: పొన్నం, సచివాలయంలో తోపులాట
హైదరాబాద్/నల్గొండ: పద్నాలుగేళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన ఉద్యమం వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పడం సరికాదని, ప్రజల ఆకాంక్షను గుర్తించినందు వల్ల తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చారని కాంగ్రెస్ మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ శుక్రవారం అన్నారు.
ఆయన నల్గొండలో మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ తప్పిదాల వల్లే కాంగ్రెస్ ఓటమి పాలయిందన్నారు. తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిన విషయాన్ని సరిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయామన్నారు. పోలవరం ఆర్టినెన్స్ విషయంలో తెరాస తీసుకునే నిర్ణయానికి తాము మద్దతిస్తామని చెప్పారు.

నల్గొండ జిల్లా ప్రజలు విజ్ఞతను ప్రదర్శించి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎంపీగా గెలిపించారన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించినందుకు కృతజ్ఞతలు అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇచ్చిందని చెప్పారు.
సచివాలయంలో ఉద్యోగుల వాగ్వాదం
సచివాలయంలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయం సంఘం కార్యాలయంలో తెలంగాణ ఉద్యోగ సంఘాలు సమావేశం ఏర్పాటు చేసుకోవడంతో వివాదం చెలరేగింది. ఓ వర్గం ఉద్యోగులు కొత్త సంఘం ఏర్పాటుకు సమావేశం కాగా దానిపై ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం ప్రశ్నించింది. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.
మరోవైపు ఇంటర్ బోర్డులో తెలంగాణ ఉద్యోగిని ఆంధ్రకు కేటాయించారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రాకు కేటాయించారు. దీంతో తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.












Click it and Unblock the Notifications