ఖైదీ నంబర్ 2261గా పోసాని..! హైకోర్టుకు వైసీపీ లాయర్..! రిమాండ్ రిపోర్ట్ లో పవన్.. !
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేసిన వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని కోర్టులో హాజరుపర్చాక ఇవాళ రాజంపేట సబ్ జైలుకు తరలించారు. జైల్లో ఆయనకు ఖైదీ నంబర్ 2261ను కేటాయించారు. ఈ నేపథ్యంలో పోసానిని విడిపించేందుకు వైసీపీ నేత, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.
మొన్న రాత్రి పోసానిని హైదరాబాద్ లో అరెస్టు చేశాక అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లె పోలీసు స్టేషన్ కు తెచ్చిన పోలీసులు .. 9 గంటల పాటు సుదీర్ఘంగా ఆయన్ను విచారించారు. అనంతరం రాత్రి 9.30 గంటలకు రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పోసానిని పోలీసులు హాజరు పరిచారు. దీంతో రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇవాళ తెల్లవారుజాము 5 గంటల వరకు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాక పోసానిని రెండు వారాల పాటు రిమాండ్ పై రాజంపేట సబ్ జైలుకు తరలించారు.

పోసాని తరఫున రైల్వే కోడూరు కోర్టులో వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఆయనకు ఊరట మాత్రం ఇప్పించలేకపోయారు. బీఎన్‌ఎస్ చట్టం ప్రకారం పోసానికి 41ఏ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరినా న్యాయమూర్తి అంగీకరించలేదు. వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు పోసానికి రిమాండ్ విధించాలంటూ పోలీసులు చేసిన వాదనను జడ్డి అంగీకరించారు. దీంతో పోసానికి రెండు వారాల రిమాండ్ విధించారు. దీనిపై స్పందించిన పొన్నవోలు హైకోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించారు.
మరోవైపు పోసాని రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పలు కీలక అంశాలు పేర్కొన్నారు. ప్రముఖ సినీనటుడి కుటుంబాన్ని అవమానించేలా మాట్లాడారని, ఆయన భార్యపై అత్యంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని తెలిపారు. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడంతో పాటు ప్రముఖ నటుడి ప్రతిష్టకు విఘాతం కలిగించారన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తి గత జీవితంపై దారుణమైన రీతిలో వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తన కుమారులకు దళితులతో ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేయననీ ఎలాంటి సంబంధాలు కుదుర్చుకోనని పోసాని దారుణంగా మాట్లాడారని కూడా తెలిపారు.దళితుల్ని కించపరిచేలా, విద్వేషాలు రెచ్చ గొట్టేలా వ్యాఖ్యలు పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు.
రాజకీయ నాయకుల్ని, వారి కుటుంబాల్లోని మహిళలను అసభ్య పదజాలంతో దూషించారని, పోసాని కృష్ణమురళి పై రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులున్నాయని తెలిపారు. పోసానికి రిమాండు విధించకుండా వదిలేస్తే విచారణ కష్టమవుతుందని పోలీసులు తెలిపారు. పోసాని సినీరంగానికి చెందినవారు కావడంతో ఆయన మాటలు చాలా మందిపై ప్రభావం చూపుతాయని, బహిరంగంగా,సమాజంలో విభజన తీసుకొచ్చేలా పోసాని వ్యాఖ్యలు చేశారని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. ఉద్రిక్తతలు సృష్టిం చేందుకు పోసాని ప్రయత్నించారన్నారు. పోసానికి రిమాండు విధించక పోతే ఇవే నేరాల్ని మరింత వ్యవస్థీకృతంగా చేస్తారన్నారు. పోసాని పోలీసుల విచారణకు సహకరించలేదని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications