పల్నాడు టెన్షన్- వైసీపీ ఎమ్మెల్యేలు కాసు, పిన్నెల్లి హౌస్ అరెస్టు-జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్..
ఏపీలోని పల్నాడు జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నెలకున్న ఉద్రిక్తతలు ఇవాళ వరుసగా మూడో రోజూ కొనసాగుతున్నాయి. ఎన్నికల పోలింగ్ రోజు చోటు చేసుకున్న హింస, దానికి ప్రతిహింస నేపథ్యంలో పోలీసులు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. అయినా దాడులు ఆగడం లేదు. ఈ తరుణంలో వైసీపీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు ఇవాళ హౌస్ అరెస్టు చేశారు.
పల్నాడులో చెలరేగిన హింసలో ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై దాడులు జరిగాయి. అలాగే వీరి అనుచరులు కూడా భారీ ఎత్తున దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులు, ప్రతిదాడుల్లో భారీగా వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. పరిస్ధితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు వీరిని ఇళ్లలో నుంచి కదలకుండా హౌస్ అరెస్టు చేశారు. 144 సెక్షన్ నేపథ్యంలో రోడ్లపై జనం గుమికూడకుండా చెదరగొడుతున్నారు.

ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలను కూడా నియంత్రిస్తున్నారు. ఎన్నికల తర్వాత దాడులకు పాల్పడిన వారిపై ఇప్పటికే కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేస్తున్నారు. దీంతో క్రమంగా పరిస్ధితి అదుపులోకి వస్తోంది. అయినా ఇప్పటికీ ఉద్రిక్తత, ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. దీంతో నేతలు కూడా బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు.












Click it and Unblock the Notifications