
Power crisis in AP: తెలంగాణాలో బొగ్గున్నా ఏపీకి ఇవ్వటం లేదు; దానిపై రాజకీయం చెయ్యొద్దన్న మంత్రి బాలినేని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా నెలకొన్న బొగ్గు కొరతతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో గణనీయంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రస్తుతం ఏపీలో గ్రామీణ ప్రాంతాలలో కరెంటు కొరత నేపద్యంలో అప్రకటిత విద్యుత్ కోతలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో బొగ్గు కొరత ఏర్పడడంతో విద్యుదుత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర డిమాండ్ కు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి జరగని పరిస్థితి ఏపీలో కనిపిస్తుంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిమాండ్ కు తగినట్లుగా విద్యుత్ ను సరఫరా చేయడం కోసం ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తుంది.

విద్యుత్ శాఖా మంత్రి బాలినేనిని టార్గెట్ చేసిన ప్రతిపక్షం
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏసీల వినియోగం తగ్గించాలంటూ ప్రజలకు సూచనలు చేయడంతో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ అయ్యారు.
విద్యుత్ సంక్షోభం వస్తే విద్యుత్ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడలేదని, రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి ఏమిటి అని ప్రతిపక్షాలు బాలినేని శ్రీనివాస రెడ్డి పై ధ్వజమెత్తాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి కాసేపు నీ పేకాట శిబిరాల నుండి బయటకు రా.. నీ హవాలా సూట్ కేసుల తరలింపు కార్యక్రమాన్ని కాసేపు పక్కన పెట్టి సమాధానాలు చెప్పు.. ఎంతసేపూ నీ సెక్రటరీని మీడియా ముందుకు తోలడం కాదు అంటూ టిడిపి నేత పట్టాభి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఒక్క పట్టాభి మాత్రమే కాదు చంద్రబాబు, లోకేష్ సైతం రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభంపై విద్యుత్ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి మెగావాట్ అంటే అర్ధం కూడా తెలీదని ఎద్దేవా చేశారు. మంత్రి పట్టింపులేని తనం, జగన్ సర్కార్ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రానికి కరెంట్ కష్టాలు వచ్చాయని వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ సంక్షోభం తాత్కాలికం
ఈ క్రమంలో తాజాగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభంపై మాట్లాడిన బాలినేని శ్రీనివాసరెడ్డి బొగ్గు కొరత దేశవ్యాప్తంగా ఉందని వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏదో ఒక స్థాయిలో అనేక సంక్షోభాలను విద్యుత్ రంగంలో ఎదుర్కొన్నాయి అని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం తాత్కాలికమేనని చెప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ఇబ్బందులు త్వరలోనే తొలగిపోతాయని వెల్లడించారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులను అధిగమించడం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు బొగ్గు కొరత కారణంగా జెన్కో యూనిట్లను పూర్తిస్థాయిలో నడపలేని పరిస్థితి ఉందని, ఇక ఈ సమయాన్ని కూడా వృథా చేయకుండా రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంటులో వార్షిక మరమ్మతులు చేపట్టామని వెల్లడించారు.
తెలంగాణాకు బొగ్గు కొరత లేదు, తెలంగాణా ఏపీకి బొగ్గు ఇవ్వటం లేదు
తెలంగాణ రాష్ట్రానికి బొగ్గు కొరత లేదని, తెలంగాణ రాష్ట్రం అక్కడున్న బొగ్గు నిల్వలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం లేదని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో శ్రీశైలంలో మాత్రమే ఏపీ విద్యుత్ ఉత్పత్తి చేసుకోగలుగుతుంది అని పేర్కొన్న బాలినేని దీనిని రాజకీయం చేయవద్దని మనవి చేస్తున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సహకారంతో వినియోగదారుల మద్దతుతో ఈ సంక్షోభాన్ని అధిగమిస్తామని బాలినేని శ్రీనివాస రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

త్వరలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమిస్తామన్న బాలినేని
విద్యుత్ రంగ ఉద్యోగులు, సిబ్బంది, రాష్ట్రంలోని రైతులు, వినియోగదారులకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రకటన చేసిన బాలినేని రాష్ట్రంలోని విద్యుత్ సంక్షోభంపై ప్రకటన చేశారు. తీవ్రమైన బొగ్గు కొరత ఉన్నప్పటికీ, తక్కువ అంతరాయాలతో వినియోగదారులకు విద్యుత్ ను అందిస్తున్నారని పేర్కొన్న బాలినేని ఇంధన శాఖ అధికారులను అభినందించారు. సాధ్యమైనంత త్వరలో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమిస్తామని బాలినేని స్పష్టం చేశారు.