ఏపీలో జిల్లాల విభజన చిచ్చు-సీఎం జగన్ కు ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేల లేఖ
ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు ఇవాళ లేఖ రాశారు. ఇందులో ప్రకాశం జిల్లా విభజనపై వారు తమ అభ్యంతరాల్ని ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సీఎం జగన్ కు లేఖ రాసిన ఎమ్మెల్యేల్లో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి ఉన్నారు.
ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన అస్తవ్యస్తంగా ఉందని, విభజన ప్రక్రియ శాస్త్రీయంగా జరగలేదని భావిస్తున్నట్లు ఎమ్మెల్యేలు సీఎం జగన్ కు తెలిపారు. జిల్లా అవసరాలు, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రజల సూచనలు, సలహాల మేరకు ఈ లేఖ రాస్తున్నామన్నారు. అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో మీ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే జిల్లా మూడు ముక్కలు అవుతుందన్నారు. దీంతో ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని వారు పేర్కొన్నారు.

ప్రస్తుత జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి మార్కాపురం 95 కిలోమీటర్లు, గిద్దలూరు150 కిలోమీటర్లు, ఎర్రగొండపాలెం140 కిలోమీటర్లు, కనిగిరి 80 కిలోమీటర్లు,దోర్నాల 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. బాపట్లలో కలపబోతున్న అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు బాపట్లకు 120 కిలోమీటర్ల దూరంలో ఉందని, అద్దంకి నియోజకవర్గం ప్రకాశం జిల్లా కేంద్రానికి అతి దగ్గరగా ఉందని గుర్తుచేశారు. అలాగే కందుకూరు నియోజకవర్గం ఒంగోలుకు 40 కిలో మీటర్ల దూరం మాత్రమే ఉందని, నెల్లూరుకు కందుకూరు 120 కిలో మీటర్ల దూరంలో ఉందని, కాబట్టి .కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపడం అనే ప్రతిపాదన సమంజసం కాదని ఎమ్మెల్యేలు ఆక్షేపించారు. రాష్ట్రంలో24 మండలాతో ఉన్న అతిపెద్ద రెవెన్యూ డివిజన్ గా ఉన్న కందుకూరును పూర్తిగా రద్దు చేయడం సమంజసం కాదన్నారు. ఈ దశలో అత్యంత వెనుకబాటుకు గురైన ఈ ప్రాంతాన్ని (జిల్లాను) మూడు ముక్కలు చేసే ప్రక్రియ జిల్లా లక్ష్యాన్ని దెబ్బతీసేలా ఉంది. ప్రస్తుతం కొత్త జిల్లాల ప్రతిపాదన అశాస్త్రీయంగా ఉందనేది జిల్లాలో నెలకొన్న పరిస్థితులే తార్కాణమని టీడీపీ ఎమ్మెల్యేలు తెలిపారు.












Click it and Unblock the Notifications