వైసీపీకి ప్రశాంత్ కిషోర్ హ్యాండ్ ? కాంగ్రెస్ తో పొత్తుకు ఒప్పుకోకపోతే ! తేలేది అక్కడే
ఏపీలో 2019లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజా ఆలోచనలు ఆ పార్టీని టెన్షన్ లోకి నెడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న పీకే ఆలోచన వైసీపీ భవిష్యత్ ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీని వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని సూచించిన పీకే.. అది కుదరకపోతే మాత్రం వైసీపికి పూర్తి స్ధాయిలో గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి.

వైసీపీతో ప్రశాంత్ కిషోర్ స్నేహం
ఏపీలో 2014 ఎన్నికల్లో వెంట్రుక వాసిలో ఓటమిపాలైన వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ.. అప్పటికే మోడీ సహా పలువురు నేతల్ని అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయిన ప్రశాంత్ కిషోర్ పై దృష్టిపెట్టింది. 2018 నాటికి ప్రశాంత్ కిషోర్ సేవల్ని తీసుకునేందుకు వైసీపీ సిద్ధపడింది. జగన్ కోరిక మేరకు పీకే వైసీపీ కోసం పనిచేయడం మొదలుపెట్టారు. చివరికి 2019లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తర్వాత కూడా పీకే సేవల్ని వాడుకునేందుకు జగన్ సిద్ధమయ్యారు.

మరోసారి పీకేపై జగన్ ఆశలు
2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం వెనుక పీకే పాత్ర ఎంతుందో అందరి కంటే ఎక్కువగా తెలిసింది జగన్ కే. దీంతో ఆయన మరోసారి పీకే సేవల్ని 2024లోనూ వాడుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు కేబినెట్లోనే మంత్రులకు ఈ ఏడాది పీకే తమతో జాయిన్ అవుతారని చెప్పేశారు. ఇప్పటి నుంచి ప్రారంభిస్తే 2024 కల్లా పీకే సలహాలతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని జగన్ భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రశాంత్ కిషోర్ జాతీయ స్దాయిలో కొత్త ఆలోచనలకు తెరలేపారు.

కాంగ్రెస్ లోకి పీకే ఎంట్రీ
జాతీయస్ధాయిలో ఓసారి బీజేపీ కోసం పనిచేసి నరేంద్రమోడీని ప్రధాని చేయడంలో కీలకపాత్ర పోషించిన పీకే.. ఆ తర్వాత మాత్రం ప్రాంతీయ పార్టీలతోనే పనిచేస్తూ వచ్చారు. ఈ మధ్యలో బీజేపీ మిత్రపక్షం జేడీయూలో చేరిపోయి ఉపాధ్యక్ష పదవి కూడా చేపట్టారు. అయితే బీజేపీతో కూడిన జేడీయూ విధానాలు నచ్చకపోవడంతో ఆ పార్టీని వీడారు. ఆ తర్వాత తిరిగి డీఎంకే, శివసేన, టీఎంసీ వంటి పార్టీల్ని బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి గెలిచేలా చేశారు. దీంతో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ కోసం ఎదురుచూస్తున్న ఆయా పక్షాలకు పీకే ఆశాదీపంలా కనిపించారు. ఇదే అదనుగా ప్రధాన విపక్షం కాంగ్రెస్ ఆయనపై వల విసిరింది. దీంతో ఆయన కూడా సై అన్నారు. కాంగ్రెస్ పునరుజ్జీవం కోసం భారీ ప్లాన్ సిద్ధం చేశారు. అందుకు ప్రతిగా ఆయన్ను పార్టీలోకి తీసుకుని గౌరవనీయ పదవి ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఇదే సమయంలో ఏపీలో వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ కు పీకే సూచించారు.

కాంగ్రెస్ తో పొత్తుపై వైసీపీ మౌనం
కాంగ్రెస్ పార్టీకి సలహా ఇచ్చే క్రమంలో వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని పీకే సూచించినా జగన్ మాత్రం దీనిపై మౌనంగానే ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని విజయసాయిరెడ్డితో చెప్పించారు. తద్వారా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ తో పొత్తుపై ఎటూ తేల్చకుండా దాటేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో పొత్తు కోసం పీకే కూడా వైసీపీని, జగన్ ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లోగా ఇది జరగాలని పీకే పట్టుబడుతున్నారు. అది కుదరకపోతే ఏం జరగబోతోందో కూడా పీకే క్లారిటీ ఇచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.

జగన్ కు పీకే హ్యాండ్?
ఇప్పటికే బీజేపీ వ్యతిరేక పక్షాల్ని కూడగడుతున్న ప్రశాంత్ కిషోర్ ఈ క్రమంలో టీఎంసీ, డీఎంకే, శివసేన వంటి పార్టీలను గెలిపించారు. అంతే కాదు వారందరినీ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో జట్టు కట్టేలా సూచనలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తో పొత్తుల్లో ఉన్న డీఎంకే, ఎన్సీపీ, శివసేన వంటి పార్టీలు ఎలాగో యూపీఏతోనే ఉంటాయి. టీఎంసీతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఇతర పార్టీలను ఒప్పించేందుకు పీకే ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ తో జట్టు కట్టక ముందే తాను జట్టు కట్టిన కాంగ్రెస్ వ్యతిరేక టీఆర్ఎస్, వైసీపీ వంటి పార్టీలకు మాత్రం డీల్ దెబ్బతినకుండా ఐప్యాక్ సాయం చేస్తుందని చెప్తున్నారు. కానీ పీకే లేని ఐప్యాక్ తమకెందుకన్న భావనలో ఆయా పార్టీలున్నాయి. దీంతో కాంగ్రెస్ తో జట్టు కడితేనే వైసీపీతో కానీ టీఆర్ఎస్ తో కానీ పీకే ప్రయాణం ముందుకు సాగుతుందని తెలుస్తోంది. ఇందుకు ఒప్పుకోకపోతే మాత్రం ముందుగా జగన్ కు హ్యండివ్వడం ఖాయమంటున్నారు. వచ్చే నెలలో జరిగే కాంగ్రెస్ చింతన్ బైఠక్ తర్వాత ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications