అంతా మోసమే: మంత్రి పత్తిపాటి హెచ్చరిక
మోసానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు
అమరావతి: మోసానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. ప్రస్తుత కాలంలో
మోసం సర్వాంతర్యామి అయిపోయిందని, ఇది అది అని తేడా లేకుండా అన్నింటిలోనూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. బేకరీలో తినే కేకు నుంచి... బంగారం, పెట్రోలు, గ్యాస్, సిమెంట్, ఎరువులు, చివరకు నీళ్ల బాటిల్స్ సహా జనం కొనే ప్రతిదానిలోనూ మోసం జరుగుతోందన్నారు.
వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో తూనికలు, కొలతల శాఖకు చెందిన 13 జిల్లాల అధికారులతో సోమవారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బంగారు దుకాణాల్లో అయితే, వారి చేసే మోసానికి అంతే లేకుండా పోతోందన్నారు. గోల్డ్ షాపుల్లో 10 నుంచి 12 శాతం వసూలు చేయాల్సిన వ్యాట్... 20 నుంచి 22 శాతం వసూలు చేస్తున్నారని మంత్రి చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా వినియోగదారులు అన్నివిధాలా మోసపోతున్నట్లు తన సమీక్షలో స్పష్టమైందని మంత్రి తెలిపారు. రూ.20 అమ్మాల్సిన మంచి నీళ్ల బాటిళ్లను రూ.50కి అమ్ముతున్నారని చెప్పారు. 75 పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ తక్కువగా పోస్తున్నట్లు అధికారులు గుర్తించారన్నారు. గుణదలలోని బంకు లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించామన్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కవ ధరకు అమ్మినా, తరుగు వచ్చినా ఆ కంపెనీలపై కేసులు పెడతామని హెచ్చరించారు.
9కంపెనీలకు చెందిన ఎరువుల బస్తాల్లో ఒకొక్క దాంట్లో రెండు కిలోల వరకు తరుగు వచ్చినట్లు గుర్తించామని, 40 వేల బస్తాల్లో తరుగు వచ్చిందని ఆ కంపెనీలపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఎరువుల వ్యాపారులపై రూ.1.33కోట్ల జరిమానా విధించామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఇలా అకమ్రాలకు పాల్పడిన వ్యాపారులమీద మొత్తం రూ.8.60 కోట్ల మేర జరిమానా విధించామన్నారు.
14 సిమెంటు కంపెనీల్లోని, సిమెంటు బస్తాల్లో కూడా బస్తాకు రెండేసి కిలోల చొప్పున తగ్గుతోందని గుర్తించామన్నారు. 26 వేబ్రిడ్జిల్లో కూడా లోపాలు ఉన్నట్లు తేలిందన్నారు.
గ్యాస్ సిలెండర్లలో కూడా బరువు తగ్గుతుందని గుర్తించినట్లు మంత్రి తెలిపారు.
మోసాలపై అధికారులకు తెలియజేసేందుకు త్వరలో టోల్ ఫ్రీ నెంబర్‌ని ఏర్పాటు చేస్తామన్నారు. కాగా, తమ శాఖలో సిబ్బంది కొరత ఉందని, దీనివల్ల ఎక్కువగా దాడులు చేయలేకపోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో లీగల్ మెట్రాలజీశాఖ ల్యాబ్‌లు, కార్యాలయ భవనాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.50 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. తూనికలు కొలతల శాఖలో ఖాళీలు భర్తీ చేయనున్నామని తెలిపారు.












Click it and Unblock the Notifications