ఎన్నికల బరిలోకి ప్రవీణ్ ప్రకాశ్ - పార్టీ, నియోజకవర్గం ఫిక్స్..!!
ప్రవీణ్ ప్రకాశ్. ఎన్నో వివాదాలు.. మరెన్నో వైరుధ్యాలు కలిగిన అధికారి. ఏపీలో సుదీర్ఘ కాలం పని చేసిన ప్రవీణ్ ప్రకాశ్ తాజాగా ఒక వీడియోతో మరో సారి వార్తల్లో నిలిచారు. ఏబీ వెంకటేశ్వర రావు, జాస్తి కిషోర్ కు గతంలో తన కారణంగా ఎదురైన ఇబ్బందులకు క్షమాపణ చెప్పారు. జగన్ హయాం లో ఒక వెలుగు వెలిగిన ప్రవీణ్ ప్రకాశ్ పొలిటికల్ ఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తోంది. పార్టీతో పాటుగా నియోజక వర్గం ఫైనల్ చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఈ వ్యవహారం అధికార వర్గాలతో పాటుగా పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఆసక్తి కరంగా మారింది.
ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ పొలిటికల్ ఎంట్రీ పైన చర్చ సాగుతోంది. ఏపీలోని పలు ప్రాంతాల్లో పని చేసిన ప్రవీణ్ ప్రకాశ్.. మాజీ సీఎం జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించారు. అనేక కీలక నిర్ణయాల్లో ప్రధాన పాత్ర పోషించారు. నాటి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను ఆ హోదా నుంచి తప్పించే జీవో జారీ చేసిన సమయంలో ప్రవీణ్ ప్రకాశ్ వైఖరి పైన విమర్శలు వచ్చాయి. అదే విధంగా ఐపీఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావు, ఐఆర్ఎస్ అధికారి జాస్తి కిషోర్ విషయంలోనూ ప్రవీణ్ ప్రకాశ్ తీరు పైన భారీగా ట్రోలింగ్ జరిగింది. దీని పైన తాజాగా స్పందించిన ఆయన వారికి క్షమాపణ చెప్పారు. ఇదే సమయంలో ప్రవీణ్ ప్రకాశ్ రాజకీయంగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు. సుదీర్ఘ కాలం ఢిల్లీలో పని చేసిన అనుభవం ఉండటంతో ప్రస్తుతం కేంద్రంలో కీలక స్థానాలతో ఉన్న వారితో మంచి రిలేషన్ ఉంది. ప్రవీణ్ ప్రకాశ్ వారి ద్వారా బీజేపీలో చేరేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఇందు కోసం అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లుగా అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగా...2027 లో ఉత్తర ప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలనే ఆలోచనలోనూ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆయన పోటీకి కోట్లాది మంది భక్తులు ఎంతో నమ్మకంగా చెప్పుకొనే వారణాశి ని ఎంచుకున్నారని తెలుస్తోంది. అది ప్రవీణ్ ప్రకాశ్ సొంత ప్రాంతం. అదే విధంగా..అక్కడ తెలుగు వారి ప్రభావం సైతం ఎక్కువే. అక్కడి పలు సంఘాల నేతలతో ప్రవీణ్ కు మంచి సంబంధాలు ఉన్నాయి.
గతంలో ప్రధాని మోదీ తన మానస పుత్రికగా చెప్పుకొన్న స్వచ్ఛభారత్ మిషన్‌లో వారణాశిలోనే ప్రవీణ్ ప్రకాశ్ పని చేసారు. ప్రవీణ్ ప్రకాశ్ తండ్రి కూడా ఓబ్రా థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌కు చీఫ్ ఇంజినీర్‌గా వారణాసిలోనే పనిచేశారు. 1994 బ్యాచ్ కు చెందిన ప్రవీణ్ ప్రకాశ్ కు తన బ్యాచ్ మెట్స్ అనేక మంది రాజకీయంగా కేంద్రంలో పలు స్థానాల్లో ఉండటం ఇప్పుడు కలిసొచ్చే అంశం. ప్రస్తుత కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సైతం ప్రవీణ్ ప్రకాశ్ బ్యాచ్ కు చెందిన అధికారి. అయితే, బీజేపీ లో చేరటానికి సమస్యలు ఉండకపోయినా..చేరిన వెంటనే ఆయన ఎమ్మెల్యే సీటు ఆశించ టం పైనే ఇప్పుడు చర్చ నడుస్తోంది. ప్రస్తుతం వారణాసి ఎమ్మెల్యేగా బీజేపీ నేత సౌరభ్ శ్రీవత్సవ ఉన్నారు. ఆయన్ను కాదని ప్రవీణ్ ప్రకాశ్ కు సీటు సాధ్యమేనా అనే చర్చ మొదలైంది. కాగా, ప్రవీణ్ ప్రకాశ్ పొలిటికల్ ఎంట్రీ.. పోటీ పైన త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications