క్లైమాక్స్ కు పీఆర్సీ అంశం - రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ : ప్రకటించేది ఎంత..!!
ఏపీ ఉద్యోగులు సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న పీఆర్సీ తుది అంకానికి చేరింది. ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్న విధంగా నేరుగా ముఖ్యమంత్రితో సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు (గురువారం) ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఇంకా పీఆర్సీ వ్యవహారం పైన నాన్చటం సరి కాదని..తేల్చేయాలని సీఎం డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఈ మధ్నాహ్నం ముందస్తుగా సీఎం జగన్ సీఎస్ సమీర్ శర్మ..ఆర్దిక శాఖ అధికారులతో సీఎం సమీక్ష ఏర్పాటు చేసారు.

అధికారులతో సీఎం కీలక భేటీ
అందులో ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సారాంశం... ఉద్యోగులు ఫిట్ మెంట్ గా ఎంత కోరుతున్నారనే అంశం పైన అధికారులు సీఎంకు వివరించనున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తాము గతంలో ఇచ్చిన హామీ మేరక అమలు చేస్తున్న 27 శాతం ఐఆర్ కంటే ఎక్కువగా ఫిట్ మెంట్ ఉండాలని సూచించారు. అయితే, అధికారులు మాత్రం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చల సమయంలో ఫిట్ మెంట్ అంశం పైన ప్రస్తావన లేకుండానే..రాష్ట్ర అర్ధిక పరిస్థితుల పైన వివరిస్తూ వచ్చారు. దీని పైన ఉద్యోగ సంఘాల నేతలు అసహనం వ్యక్తం చేసారు.

సీఎంతో నేరుగా ఉద్యోగ సంఘాల సమావేశం
ఇలా..ప్రతీ సారి పిలిచి తమను అవమానిస్తున్నారంటూ ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహించారు. ఇక, ముఖ్యమంత్రి జగన్ వద్ద చర్చలకే తాము వస్తామని..అందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక, అధికారులతో చర్చలు ఉండవని స్పష్టం చేసారు. ఈ నెల 9వ తేదీ లోగా సీఎంతో చర్చలు లేకుంటే..9న తమ పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఢిల్లీ పర్యటన నుంచి వచ్చిన సీఎం జగన్ పీఆర్సీ పైన ఈ మధ్నాహ్నం సమీక్ష ఏర్పాటు చేసారు. అధికారుల కమిటీ పీఆర్సీ పైన అధ్యయన నివేదికలో భాగంగా చేసిన సిఫార్సులకు ఉద్యోగ సంఘాలు ససేమిరా అంటున్నాయి.

ఫిట్ మెంట్ అంశం తేల్చాల్సిందే
దీంతో.. సీఎం జగన్ తో చర్చల సమయంలో ఏ మేర ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించే అవకాశం ఉందనే దాని పైన అధికారులు సీఎంకు వివరించనున్నారు. ఉద్యోగ సంఘాలు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం కంటే తమకు ఎక్కువ ఫిట్ మెంట్ వస్తుందని చెబుతూ వస్తున్నారు. అదే సమయంలో 40 శాతానికి పైగా డిమాండ్ చేస్తున్నా.. 30 శాతానికి అటు ఇటుగా ఫిట్ మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, డీఏల బకాయిలు సైతం ఉండటంతో..వీటిని సైతం పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి వద్ద ఫిట్ మెంట్ పైన ఉద్యోగ సంఘాలు తమ ప్రదిపాదన చేయనున్నారు.

ఉద్యోగులకు సంక్రాంతి గిఫ్ట్ గా..
అదే విధంగా వివిధ బిల్లులు చెల్లించాల్సిన మొత్తం రూ 1600 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి. ఆ అంశం పైనా ఉద్యోగ సంఘాలు సీఎం వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. మొత్తంగా ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీతో సహా ఆర్దిక పరమైన అంశాలకు సీఎం జగన్ రేపు ముగింపు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు సంక్రాంతి కానుకంగా పీఆర్సీ ప్రకటించనున్నారు. అయితే, పీఆర్సీ ఎప్పటి నుంచి అమలు చేస్తారనేది మాత్రం సీఎంతో సమావేశంలోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications