175లో కచ్చితంగా గెలవాల్సిన నియోజకవర్గం ఒక్కటే?
తాజాగా యువగళం పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించడంతో మంగళగిరి నియోజకవర్గంలో పనులన్నింటినీ పార్టీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. రాజధాని అమరావతి పరిధిలో ఉండటమే కాకుండా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇక్కడి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీకి సమాయత్తమవుతున్నారు. గత ఎన్నికల్లో పోటీచేసి 5వేల ఓట్ల మెజారిటీతో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఇక్కడి నుంచే విజయం సాధించాలనే పట్టుదలతో విస్త్రతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

యువగళం పేరుతో పాదయాత్ర
తాజాగా యువగళం పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించడంతో మంగళగిరి నియోజకవర్గంలో పనులన్నింటినీ పార్టీ నాయకులు పర్యవేక్షిస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు ముందు ప్రతి గ్రామాన్ని సందర్శించాలనే లక్ష్యంతో వీలు చిక్కినప్పుడల్లా ప్రతి గ్రామాన్ని సందర్శించే కార్యక్రమం పెట్టుకున్నారు. తాజాగా పార్టీ నాయకులు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు తిరుగుతున్నారు. లోకేష్ పాదయాత్రలో ఉండటంతో అతను లేని లోటును, నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేడు అనే మాట రానివ్వకుండా ఉండటం కోసం వీరంతా కష్టపడుతున్నారు.

సమాచారాన్ని తెప్పించుకుంటున్న చంద్రబాబు
మరోవైపు చంద్రబాబునాయుడు కూడా మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు అక్కడి నుంచి సమాచారాన్ని తెప్పించుకొని విశ్లేషిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఈసారి గుంటూరు జిల్లాలో మంగళగిరి నియోజకవర్గాన్ని మాత్రం కైవసం చేసుకునే దిశగా టీడీపీ అడుగులు వేస్తోంది. మంగళగిరిలో అన్న క్యాంటిన్ఏర్పాటు చేయడంతోపాటు మొబైల్ ఆరోగ్య రథం ద్వారా ప్రతి గ్రామానికి ఈ ఆరోగ్య రథం వెళుతూ, ప్రజలు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది. మెరుగైన చికిత్స అవసరమైనవారికి ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేస్తోంది. వైసీపీ కూడా లోకేష్ ను మరోసారి ఓడించాలనే పట్టుదలతో ఉంది.

ఎవరికి పట్టం కడతారో?
స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద వ్యతిరేకత పెరుగుతుండటంతో అభ్యర్థిని మార్చి విజయం సాధించాలనుకుంటోంది. అందుకనుగుణంగా మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. స్థానికంగా చేసిన అభివృద్ధి అజెండాతో ఈసారి టీడీపీ ఓడించాలనేది వైసీపీ యోచనగా ఉంది. చివరకు ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి.












Click it and Unblock the Notifications