
రాష్ట్రపతి ఎన్నిక రాజకీయం: తెలుగు సీఎంలే కీలకం: ఎవరు ఎటువైపు..మోడీ ఆప్షన్స్ ఏంటి..?
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలను బీజేపీ సెమీ ఫైనల్స్‌గా భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఐదు రాష్ట్రాల్లో గెలవాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఒకవేళ ఓటమి పాలైతే 2022 రాష్ట్రపతి ఎన్నికలో అప్పటికి ప్రతిపక్షాలు బలపడుతాయి కనుక వారు నిలబెట్టే అభ్యర్థికి తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతు తెలపాల్సి ఉంటుంది. 2022 నాటికి రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ముగుస్తుంది.
ఇక కొత్త రాష్ట్రపతి తాము నిలబెట్టిన అభ్యర్థి అయి ఉండాలంటే 2022లో ఐదు రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానున్నాయి. అక్కడ గెలిస్తేనే ఎలక్ట్రోల్ కాలేజ్‌లో బీజేపీ బలపడి తాము నిలబెట్టిన అభ్యర్థి రాష్ట్రపతిని చేసేందుకు మార్గం సులభతరం అవుతుంది. అదే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వస్తే అప్పుడు మోడీ ముందున్న ఆప్షన్స్ ఏంటి...? ఇప్పటికే శరద్ పవార్ రాష్ట్రపతి పీటంపై కన్నేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది.

రాష్ట్రపతి రేసులో శరద్ పవార్
2022లో ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా సరే ఆ ఐదు రాష్ట్రాల్లో గెలిచి కొత్త రాష్ట్రపతి ఎన్నికకు మార్గం సుగుమం చేయాలని భావిస్తోంది. కమలం పార్టీ ఆలోచన ఇలా ఉంటే... రాష్ట్రపతి పీటంపై అప్పుడే కన్నేశారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్.
ఇందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రపతిగా తను పోటీలో నిలబడితే కావాల్సిన మద్దతు కోసం శరద్ పవార్ తన స్కెచ్ తను వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేసే విపక్షాల అభ్యర్థిగా శరద్‌పవార్ పేరు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ప్రధాని మోడీ ముందున్న ఆప్షన్స్ ఏంటనే దానిపై విశ్లేషణలు ప్రారంభమయ్యాయి.

మోడీ ముందున్న ఆప్షన్స్ ఏంటి
ఒకవేళ రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్ పోటీలో నిలిస్తే... దళిత అభ్యర్థిగా తిరిగి రాంనాథ్ కోవింద్‌నే రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో నిలబెట్టే అవకాశం ఉంది. లేదా దక్షిణాది రాష్ట్రాల మద్దతు కోసం ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రమోట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ విశ్లేషిస్తున్నారు. ఇదంతా కాకుండా అందరికీ ట్విస్ట్ ఇస్తే తమ రాష్ట్రపతి అభ్యర్థి శరద్ పవారే అని ప్రకటించే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇప్పటికే శరద్ పవార్ ప్రధాని మోడీని కలిశారు. ఆ సమయంలో ఇదే విషయం చర్చకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి.

కీలకం కానున్న కేసీఆర్ జగన్ నిర్ణయం
శరద్ పవార్ ఒకవేళ ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రపతి బరిలో నిలిస్తే మహారాష్ట్రలోని శివసేన కాంగ్రెస్ పార్టీలు మద్దతు అనివార్యం అవుతుంది. ఎందుకంటే శరద్ పవార్‌కు మరట్వాడాలో మంచి పట్టున్న నేతగా గుర్తింపు ఉండటమే కాకుండా.. మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కావడంతో ఆ రెండు పార్టీలు తప్పనిసరిగా మద్దతు ఇవ్వాల్సిందే. ఇక శరద్‌పవార్‌కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్‌లతో వ్యక్తిగతంగా మంచి పరిచయాలు ఉన్నందున వారు కూడా శరద్ పవార్‌కే మద్దతు తెలిపే అవకాశాలున్నాయి.
ఎటొచ్చి తెలుగురాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ అదే సమయంలో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ల నిర్ణయం కూడా కీలకంగా మారుతుంది. పోయిన సారి ఎన్డీయే అభ్యర్థికే సీఎం జగన్ కేసీఆర్‌లు మద్దతు తెలిపారు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ఎవరివైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తికరంగా మారింది. రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో రెండు అధికార పార్టీలు టీఆర్ఎస్, వైసీపీ పూర్తి మెజార్టీతో ఉన్నాయి. అటు పార్లమెంటు రెండు సభల్లోనూ ఈ రెండు పార్టీలకు సంఖ్యాబలం ఉండటంతో కీలకంగా మారనున్నాయి.

మరింత స్పష్టత అప్పుడే...
ఇదిలా ఉంటే ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే దీనిపై మరింత స్పష్టత వస్తుంది. ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి సంఖ్యాబలం పెరిగితే ప్రధాని మోడీ కోరుకున్న అభ్యర్థే రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలుస్తారు.బీజేపీకి ఫలితాలు వ్యతిరేకంగా వస్తే అసలు కహానీ అప్పుడే ప్రారంభం అవుతుంది. ఒకవేళ ఫలితాలు ప్రతికూలంగా వస్తే శరద్‌పవార్‌నే రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించే అవకాశం లేదా మహారాష్ట్రకు చెందిన ఎస్సీ నేతను రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం జరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాతే కొత్త రాష్ట్రపతి ఎన్నికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.