అసెంబ్లీలో తెలంగాణ బిల్లు: టైం అడిగితే రాష్ట్రపతి ఒకే?

"రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు కోరినప్పుడు గడువు పొడిగించిన సందర్భాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఇచ్చిన గడువు ఈనెల 23తో ముగుస్తోంది. అయితే, ఇప్పటిదాకా అసెంబ్లీలో గందరగోళం, ఆందోళన నేపథ్యంలో సరిగా చర్చ జరగలేదు. ఒకవేళ గడువు పొడిగింపుపై రాష్ట్ర అసెంబ్లీ నుంచి అభ్యర్థన అందితే గరిష్ఠంగా మరో పది రోజులు సమయం ఇవ్వొచ్చు'' అని పిటిఐ తెలిపింది.
అదే సమయంలో బిల్లుపై చర్చించే గడువును పొడిగిస్తే వచ్చే నెలలో జరిగే పార్లమెంటు ఓటాన్ అకౌంట్ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందే అవకాశాలు సన్నగిల్లుతాయని కూడా పేర్కొంది. అయితే హోంశాఖ వర్గాలు మాత్రం భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మెజారిటీ సభ్యులు కోరితే రాష్ట్రపతి మరో రెండు వారాల వరకు సమయం ఇచ్చే అవకాశాలున్నాయని తెలిపాయి. అసెంబ్లీలో చర్చ జరిగే తీరును బట్టి రాష్ట్రపతి నిర్ణయం ఉంటుందని ఈ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి రెండోవారంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముందని, ఇవి పది నుంచి 15 రోజులు జరుగుతాయని, అందువల్ల ఫిబ్రవరి మొదటి వారం వరకు గడువు ఇచ్చినా జరిగే నష్టమేమీ లేదని, రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ఫిబ్రవరి 7న జరగనుందని, విభజనపై చర్చకు అప్పటిదాకా గడువు ఇచ్చే అవకాశం లేకపోలేదట.
తెలంగాణ నేతలు మాత్రం గడువు పెంపును కొట్టి పారేస్తున్నారు. విభజన బిల్లుపై ఇప్పటికే పలువురు ప్రధాన పార్టీల నేతలు మాట్లాడారని, మిగతా పార్టీలతో పాటు ముఖ్యమంత్రి కిరణ్, విపక్షనేత చంద్రబాబు మాట్లాడేందుకు ఈనెల 23 వరకు సమయం సరిపోతుందని, మరింత సమయం ఇవ్వనవసరం లేదంటున్నారు.












Click it and Unblock the Notifications