రాష్ట్రపతి రామ్ నాథ్ అమరావతి టూర్ షెడ్యూల్ ఖరారు...
అమరావతి: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిద్ అమరావతి టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 27న రాష్ట్రపతి అమరావతి రానున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రపతి అమరావతి పర్యటనలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన పాలన కోసం వినియోగిస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ విధానాన్ని కూడా పరిశీలించనున్నారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిధ్ అమరావతి టూర్ షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్రపతి డిసెంబర్ 27న న్యూ ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి హెలికాఫ్టర్ లో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయానికి చేరుకుంటారు. విశ్వవిద్యాలయంలో జరిగే ఇండియన్ ఎకనామిక్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అనంతరం అక్కడ నుంచి హెలికాప్టర్‌లో వెలగపూడి సచివాలయానికి వెళతారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఫైబర్‌గ్రిడ్‌ను రాష్ట్రపతి ప్రారంభిస్తారు.

రాజధానిలో రాష్ట్రపతి పర్యటన....
ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవం అనంతరం ఒక ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా వినియోగదారులతో మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. తర్వాత సచివాలయంలో ఒకటో బ్లాక్‌లో ఏర్పాటు చేసిన రియల్‌టైమ్ గవర్నెన్స్ వ్యవస్థ పనితీరును రాష్ట్రపతి పరిశీలిస్తారు. ఈ వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా రాష్ట్రపతికి వివరిస్తారు.

రాష్ట్రపతి రాక సందర్భంగా భద్రతా ఏర్పాట్లు...
రాష్ట్రపతి హోదాలో తొలిసారి నవ్యాంధ్ర రాజధాని అమరావతికి విచ్చేస్తున్న రామ్ నాథ్ కోవిద్ కు ఘనంగా స్వాగతం పలికేందుకు ఎపి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రపతి రాకను పురస్కరించుకొని తీసుకోవాల్సి భద్రతా చర్యలు, స్వాగత ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ డీజీపీ సాంబశివరావుతో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, విజయవాడ పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శి శ్రీకాంత్, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications