ap bjp pm modi bjp leaders ramakrishna ganta srinivas pressure ప్రైవేటీకరణ పిఎం మోడీ రామకృష్ణ గంటా శ్రీనివాస్ ఒత్తిడి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ..ఇరుక్కున్న ఏపీ బీజేపీ..రాజీనామాల డిమాండ్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ మెడకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంతో ఉచ్చు బిగుస్తోంది. ఒకపక్క ఏపీలో బలోపేతం కావాలని, రానున్న ఎన్నికలలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్న ఏపీ బీజేపీ తాజా పరిణామాలతో కుదేలవుతుంది.

మోడీ వ్యాఖ్యల ఎఫెక్ట్ .. బీజేపీ నేతలపై రాజీనామాల ఒత్తిడి
ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలతో బిజెపి మరింత టార్గెట్ అవుతోంది. ఏపీ బీజేపీని టార్గెట్ చేస్తున్నారు పలువురు రాజకీయ నాయకులు. ప్రభుత్వ రంగ సంస్థలు నడపలేమని, ప్రైవేటు సంస్థలకు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగంగా చేసిన ప్రకటనతో బీజేపీ నాయకులపై ఒత్తిడి మరింత పెరిగింది. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి కేంద్రం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.

సోము వీర్రాజు , జీవీఎల్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ఇంతా జరుగుతున్నా బీజేపీ రాష్ట్ర నేతలు ఏమీ జరగడం లేదు అన్నట్టు ప్రగల్భాలు పలుకుతున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ బీజేపీ నేతలకు ఏమాత్రం సిగ్గున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉంటే తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి నేతలు ఢిల్లీ వరకు వెళ్లినా ప్రధాని నరేంద్ర మోడీ కనీస అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఎంపీ జీవీఎల్ నరసింహారావును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

బీజేపీ నేతలు కార్యాచరణ ప్రకటించాలన్న గంటా శ్రీనివాస్
బిజెపి రాష్ట్ర నేతలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణకు కట్టుబడి పనిచేయాలని, కేంద్ర నిర్ణయాన్ని మార్చుకునేలా చేయాలని డిమాండ్ చేస్తున్న నేతలు, ఒకవేళ ప్రైవేటీకరణ జరిగితే రాజీనామాలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటా శ్రీనివాస్ సైతం ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని ,తమ కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

మోడీ వ్యాఖ్యలతో టార్గెట్ అయిన బీజేపీ నేతలు
ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ అమ్మేస్తాం అంటున్నారని అబ్బే అలాంటిదేమీ లేదని ఏపీ బీజేపీ నేతలు మభ్యపెడుతున్నారని వ్యాఖ్యానించారు. బిజెపి నేతలు ఇప్పటికైనా మేల్కొని పదవుల కోసం కాకుండా, ప్రాంతం కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు గంటా శ్రీనివాస్. విశాఖ ఉక్కు కాపాడుకోవడానికి అందరూ ఏకతాటి మీద నిలబడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇక బీజేపీ నేతలు తమ కార్యాచరణను ప్రకటించాలని చెప్పి ఇరకాటంలో పెట్టారు.

బీజేపీ నేతలకు ఊహించని కష్టాలు తెచ్చిపెట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ రగడ
తాజా పరిణామాలు ఏపీ బీజేపీకి సంకటంగా తయారయ్యాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న తీరుగా బీజేపీ నేతలు అంతర్మథనంలో పడ్డారు. ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నా, కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకునే పరిస్థితులు లేని కారణంగా ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు బిజెపి నేతలు. మొత్తానికి మిగతా పార్టీలతో పోలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రగడ బిజెపి నేతలకు ఊహించని కష్టాలను తెచ్చి పెట్టింది.