విభజన తీరు బాధేసింది: సోనియాకు పురంధేశ్వరి లేఖ
హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాసినట్లు కేంద్రమంత్రి పురంధేశ్వరి తెలిపారు. శనివారం ఆమె హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తమ ప్రాంత సమస్యలను పరిష్కరించాలని ఆ లేఖలో విన్నవించినట్లు తెలిపారు. తమ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించకుండా విభజనకు వెళితే పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. ఇప్పటికే తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు.
తన రాజీనామాను ఆమోదించాలని ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కోరినట్లు పురంధేశ్వరి చెప్పారు. రాష్ట్ర విభజన అంశంలో పోలవరం విషయంలో తనకు చాలా బాధ కలిగించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిగా ఆంధ్ర ప్రాంతంలో ఉండాలన్నదే తమ అభిప్రాయని అన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై స్పందిస్తూ.. రాజ్యాంగంలో ఉమ్మడి రాజధాని అన్న ప్రస్తావన లేదన్నారు. ఉమ్మడి రాజధాని అంటే ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రిని అవమానించడమే అని ఆమె అన్నారు.

హైదరాబాద్‌లో ఉండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రాన్ని ఎలా పాలించగలరని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇప్పటి వరకు తమ ప్రాంత ప్రజల విద్యా, ఉపాధి అవకాశాలపై స్పష్టమైన భరోసా ఇవ్వలేదని అన్నారు. ఈ విషయంలో భరోసా కల్పించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపిలు మొదట్నుంచి సమైక్య రాష్ట్రం కోసం పట్టుబట్టామని తెలిపారు. తమపై అనవసరంగా ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
విభజన అనివార్యం అని అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చిన తర్వాతనే సీమాంధ్ర ప్రాంతానికి కావాల్సిన ఐఐటీ, రైల్వో జోన్ లాంటివి కోరామని పురంధేశ్వరి తెలిపారు. ఇవి ప్యాకేజీలు అవుతాయా అని ఆమె ప్రశ్నించారు. తమ స్వలాభం కోసం ప్యాకేజీలు అడుగుతున్నారని అనడం సరికాదని అన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఇలాంటి ప్రతిపాదనలు చేశామని అన్నారు.












Click it and Unblock the Notifications