'పెద్ది' ప్రభావం అనుకుంటా..!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా పెద్ది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జానర్‌లో రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ చిత్రాన్ని సమర్పించాయి. వృద్ధి సినిమాస్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా నిర్మించారు. ఇందులో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.
జూన్ 4వ తేదీన విడుదల కాబోతోన్న 'పెద్ది' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ నిరాశ పరిచిన నేపథ్యంలో దీనిపై అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగా ఇప్పటికే విడుదలైన పాటలు గానీ, ట్రైలర్ కు గానీ అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూసేలా చేసింది. స్పోర్ట్స్ పర్సన్ గా రామ్ చరణ్ కనిపించడం అదనపు ఆకర్షణ.

గ్రామీణ నేపథ్యంలో సాగే 'పెద్ది'లో కుస్తీ, క్రికెట్ వంటి క్రీడా అంశాలతో పాటు, భావోద్వేగ డ్రామాలతో తెరకెక్కింది. ఓ ఫుల్ ప్లెడ్జ్డ్ స్పోర్స్ట్ మెన్ గా రామ్ చరణ్ నటించడం ఇదే మొదటిసారి. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా మల్టీ డైమెన్షనల్ క్రీడాకారుడిగా అద్భుతమైన పాత్రలో కనిపించనున్నాడు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా అచ్చియమ్మ అనే రూరల్ బ్యాక్ గ్రౌండ్ క్యారెక్టర్ లో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు రామ్ చరణ్.
రేపు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగనుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ హైదరాబాద్ లో పెద్ది మేనియా అలముకుంటోంది. మెగా కాంపౌండ్ అభిమానులు ఇప్పటికే పెద్ద ఎత్తున బ్యానర్లు, కటౌట్లు కడుతున్నారు. సినిమా విడుదల కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తోన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
తాజాగా హైదరాబాద్ లో పెద్ది గదల అమ్మకాలు సైతం జోరుగా సాగుతున్నట్లు చెబుతున్నారు. రోడ్ సైడ్ వీటిని విరివిగా అమ్ముతున్నారు. ఓ ఎక్స్ యూజర్ దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అచ్చంగా పెద్దిలో రామ్ చరణ్ వినియోగించిన గదల్లానే కనిపిస్తోన్నాయి ఇవి. గదలు, కుస్తీపోటీల్లో వినియోగించే వస్తువులకు మంచి డిమాండ్ ఉందని కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియా యూజర్లు.












Click it and Unblock the Notifications